ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో సుమారు 2 వేల 500 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో చేరింది. శ్రీ వరాహలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చెందిన భూముల్లో..కొంత భూమిని గతంలో పర్సనల్ ఇనాం, చాకిరీ ఇనాంలుగా ప్రజలకు రాసి ఇచ్చారు. మరికొన్ని భూములు దేవస్థానం భూములుగానే ఉన్నాయి. ఇనాములుగా రాసి ఇచ్చిన భూములపై...ఆయా వ్యక్తులకు పూర్తి హక్కు ఉంటుంది. వ్యవసాయ భూముల్లో సాగు చేసుకోవడం, నివాస ప్రాంతాల్లో పక్కా ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నామని ప్రజలు చెబుతున్నారు.
భూముల క్రయవిక్రయాలు, ఇళ్ల నిర్మాణాలు, ఆస్తులు తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు పొందడం వంటివి 2013 వరకు సవ్యంగానే సాగింది. 2013లో ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం...ఇనామీ భూములన్నీ దేవాలయ భూములు కాబట్టి...హక్కులు కూడా దేవస్థానానికే చెందుతాయని వాటిని రిజిస్ట్రేషన్ చేయకూడదని నిషేధిత భూముల జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ప్రజల ఇబ్బందులు గమనించిన ప్రభుత్వం 2019లో జీవోకు సవరణలు చేసింది.