Water Problem in Podili: వేసవి వచ్చిందంటే చాలు.. ప్రకాశం జిల్లా పొదిలి ప్రజలు దాహార్తికి అల్లాడిపోతారు. ఏళ్లు గడుస్తున్నా.. జనాభా పెరుగుతున్నా.. పట్టణంలో తాగునీటి పథకాలు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రజలు సురక్షితమైన తాగునీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు.
ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయితీలో తాగునీటి వెతలు తీరడం లేదు. దాదాపు 15వేల జనాభా కలిగిన పొదిలితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగర్ నుంచి వచ్చే నీరే ఆధారం. మూడు, నాలుగు రోజులకొకసారి ఈ నీటిని సరఫరా చేస్తారు. ఇవి ఎంత మాత్రమూ చాలడం లేదు. ముఖ్యంగా శివారు కాలనీ వాసులు.. దూరంగా ఉన్న కొళాయిల వద్దకు వెళ్లి తాగునీటిని తెచ్చుకోవలసి వస్తోంది. ఇక ఇంటి అవసరాల కోసం నగర పంచాయతీ పంపించే ట్యాంకులే దిక్కవుతున్నాయి.
ఇదీ చదవండి :ఈఎస్‌ఐ ఆసుపత్రిలో డయాలసిస్ కిట్ల కొరత.. ఇబ్బందుల్లో రోగులు
Drinking Water Problem in Podili: పొదిలికి ఆనుకొని ఉన్న బుచ్చెన్న పాలెం బీసీ కాలనీ, కాటూరి వారి పాలెం, రాంనగర్, రాగుపాలెం తదితర 10 కాలనీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వేసవిలో ప్రభుత్వం ఒక్కో వీధికి రోజూ రెండు మూడు ట్యాంకులు పంపించేది. ప్రస్తుతం 5 రోజులకొకసారి ట్యాంకులు పంపిస్తోంది. దీంతో.. ఇంటికి 10 నుంచి 12 బిందెలు కూడా అందటంలేదు. అంటే రోజుకు ఒక కుటుంబం రెండు బిందెల చొప్పున సరిపెట్టుకోవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో గ్రామ శివార్లలో డీప్ బోర్లు తవ్వి అక్కడ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు. ఈ నీటిని డ్రమ్ముల్లో నిల్వ చేసుకొని ఇక్కడి వారు అవసరాలకు వినియోగించుకునేవారు. ప్రస్తుతం 500 అడుగుల లోతులో డీప్ బోర్లు తవ్వినా అవి పనిచేయడం లేదు. గొట్టపు బావులూ చెడిపోయాయి. కనీసం మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదు. పెద్దచెరువులో సాగర్ నీటిని నిల్వచేసి.. వేసవిలో పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.