ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైరల్: సీఐ వేధించాడంటూ వ్యక్తి ఆత్మహత్య

ఓ మహిళ ఫిర్యాదుతో కేసు కట్టిన పోలీసు అధికారి... విచక్షణారహితంగా కొడుతూ వేధింపులకు గురిచేశాడంటూ... బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మోసం చేసిన మహిళే ఫిర్యాదు చేసిందని... డబ్బులకు సీఐ అమ్ముడుపోయాడని సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. మరణానికి ముందు తీసిన ఆ సెల్ఫీ వీడియో... ప్రకాశం జిల్లా చీరాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

సీఐ వేధించాడంటూ వ్యక్తి ఆత్మహత్య
సీఐ వేధించాడంటూ వ్యక్తి ఆత్మహత్య

By

Published : Apr 17, 2021, 6:35 AM IST

సీఐ వేధించాడంటూ వ్యక్తి ఆత్మహత్య

మార్చి 19న ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పేరు అంబటి రవీంద్రబాబు. మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో... ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రకాశం జిల్లా చీరాల ప్రసాద్‌ థియేటర్‌ ప్రాంతానికి చెందిన రవీంద్రబాబు... స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. వారి మధ్య ఆర్థిక వ్యవహారాలూ నడిచాయి. తన భార్య ఆభరణాలు సైతం సదరు మహిళకు ఇచ్చాడు.

ఈ విషయం భార్యకు తెలిస్తే ఇబ్బంది అవుతుందంటూ, ఆభరణాలు వెనక్కి తీసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో చెప్పాడు. నొచ్చుకున్న ఆ మహిళ... అత్యాచారం చేసినట్లు తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని రవీంద్రబాబు వివరించాడు. విచారణ కోసం స్టేషన్‌కు పిలిచిన సీఐ.... తన వాదన వినకుండానే ఇష్టమొచ్చినట్లు కొట్టాడని వాపోయాడు. బూతులు తిడుతూ, గుండెల మీద తంతూ వేధించాడని... సెల్ఫీవీడియోలో రవీంద్రబాబు ఆరోపించాడు. ఆ సీఐపై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రిని వేడుకున్నాడు.

సీఐ చేసిన అవమానం, మహిళ చేసిన మోసం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రవీంద్రబాబు తెలిపాడు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన స్థలంలో నిర్మిస్తున్న ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. మరణానికి ముందు అందరికీ వీడ్కోలు చెప్పాడు.

రవీంద్రబాబు ఆత్మహత్యపై ఆయన భార్య బుద్ధ.... ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్‌ వివరణ ఇచ్చారు. రవీంద్రబాబును సీఐ కొట్టలేదని, బంగారం విషయంలో మహిళతో తలెత్తిన వివాదమే ఆత్మహత్యకు కారణమని స్పష్టం చేశారు. ఆరోపిస్తున్న మహిళ వద్దే బంగారు ఆభరణాలు తీసుకున్న రవీంద్రబాబు... ఆ విషయమై పలుమార్లు స్టేషన్‌కు వచ్చినట్లు చెప్పారు.

మార్చి 7వ తేదీన పోలీసుల సమక్షంలోనే ఆమెకు రవీంద్ర నుంచి ఆభరణాలు ఇప్పించినట్లు తెలిపారు. బంగారం అప్పగించడానికి ముందే సెల్ఫీ వీడియో తీసుకున్నాడని... ఆ తర్వాత పోలీసుల సమక్షంలో ఆభరణాలు అప్పగించాడని వివరించారు. ఈ పరిణామం తర్వాతే ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. దీని గురించి రవీంద్రబాబు భార్య, బంధువులు, పెద్దమనుషులకూ తెలుసని డీఎస్పీ స్పష్టం చేశారు. బాధితుడు రాసిన 10 పేజీల సూసైడ్‌ నోట్‌నూ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండీ... అలెర్ట్: కనుగుడ్డు నుంచీ శరీరంలోకి వెళ్తున్న వైరస్‌

ABOUT THE AUTHOR

...view details