ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థిని వేధింపుల ఘటన....ఎస్సై, రైటర్​పై డీఎస్పీకి ఫిర్యాదు

ఎస్సీ విద్యార్థినిని వేధించిన ఘటనలో కేసు నీరుగార్చేందుకు ప్రకాశం జిల్లా మేదరమెట్ల ఎస్సై, రైటర్ ప్రయత్నించారని దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, ఫోక్సో కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు జాప్యం చేసి, బాధితుల్ని బెదిరించిన ఎస్సై, రైటర్లపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు.

ఎస్సై, రైటర్​పై డీఎస్పీకి ఫిర్యాదు
ఎస్సై, రైటర్​పై డీఎస్పీకి ఫిర్యాదు

By

Published : Nov 9, 2020, 10:52 PM IST

ఎస్సీ విద్యార్థినిని వేధించి, ఆమె తల్లిపై దాడి చేసిన ఘటనలో నిందితులతో కుమ్మక్కై బాధితులను బెదిరించి, కేసును బలహీనపరచిన ప్రకాశం జిల్లా మేదరమెట్ల ఎస్ఐ, రైటర్లపై చర్య తీసుకోవాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు దర్శి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోమవారం మేదరమెట్ల పోలీసు స్టేషన్ ముందు ఎస్సై, రైటర్ల అవినీతి, అక్రమాలకు నిరసనగా విద్యార్థిని తండ్రి తన కుటుంబంతో సహా నిరసన దీక్షకు కూర్చుంటానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందుకు స్పందించిన డీఎస్పీ బాధితులను తన వద్దకు తీసుకు రావాల్సిందిగా దళిత నేత నీలం నాగేంద్రరావును కోరారు. దీంతో బాధితులతో కలిసి సోమవారం దర్శికి వచ్చిన నాగేంద్రరావు ఎస్సై కట్టా ఆనోకు, రైటర్ జ్యోతి వెంకటేశ్వర్లులపై ఫిర్యాదు చేశారు. విద్యార్థిని కేసుకు సంబంధించి ఎస్ఐ, రైటర్ దురుద్దేశ పూరిత చర్యలను నీలం నాగేంద్రరావు డీఎస్పీ ప్రకాశరావుకు వివరించారు.

ఎస్సీ విద్యార్థినిని కొంతకాలంగా మేదరమెట్లకు చెందిన ఆటో డ్రైవర్ గొర్రెల అనిల్ వేధిస్తూ, ఫొటోలు తీస్తున్నాడని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో బుధవారం అనిల్​ను ప్రశ్నించిన విద్యార్థిని తల్లి మల్లేశ్వరిపై అతని బంధువులు దాడి చేసి, కులం పేరుతో దూషించారని... మల్లేశ్వరి ఆమె భర్త రాంజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రైటర్ జ్యోతి వెంకటేశ్వర్లు ఫోన్ చేసి, ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్టు, రాజీ పడుతున్నట్టు సంతకం పెట్టాల్సిందిగా బెదిరించారని, ఎస్సై దుర్భాషలాడరని రాంజీ ఆరోపించారు. విద్యార్థినిని స్టేషన్​కు రప్పించి ఆమె దగ్గర ఫిర్యాదు తీసుకున్నారు. ఉదయం ఘటన జరిగితే రాత్రి పొద్దు పోతున్నా కేసు నమోదు చేయలేదని విద్యార్థిని తల్లిదండ్రులు అన్నారు. విషయం అద్దంకి సీఐ వరకు వెళ్లడంతో... ఆయన మేదరమెట్ల ఎస్సైను వివరణ కోరారు. కేసు నమోదు చేస్తామని ఎస్సై హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు.

ఎట్టకేలకు 115/20 గా కేసు నమోదు చేసినప్పటికీ, కీలకమైన ఎస్సీ ఎస్టీ యాక్టు, ఫోక్సో యాక్టు వేయలేదని నీలం నాగేంద్రరావు అన్నారు. కేసును నీరు గార్చేందుకు ఎస్సై ప్రయత్నించారని డీఎస్పీకి తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కేసును బలహీనపరిచారని ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిపై దాడి ఘటనలో 16 మంది పాల్గొనగా, కేవలం ఐదుగురిపైనే ఫిర్యాదు తీసుకొని, కేవలం ఒక్కరినే అరెస్టు చేయటం ఎస్సై, రైటర్ల అవినీతి ఉందని ఆరోపించారు.

ఇదీ చదవండి :తుంగభద్ర పుష్కరాల్లో నదీ స్నానం నిషేధం: కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details