ఒంగోలు మంగమూరు రోడ్డు సమీపంలోని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులకు ఆహారం అందిస్తూ ఆదుకుంటోంది. కరోనా పాజిటివ్ వచ్చి స్వల్ప లక్షణాలతో ఇంట్లో ఉన్న వారికీ, బయటకు వెళ్లి సరకులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికీ ఇంటింటికీ వెళ్లి భోజనం అందిస్తూ సేవా సమితి సభ్యులు ఉదారత చాటుకుంటున్నారు. సేవా సమితి సభ్యులంతా చిరు ఉద్యోగులు, విద్యార్థులే కావడం విశేషం. సుమారు రెండు వారాలుగా రోజుకు 215 మంది రోగులకు ఆహారం అందిస్తున్నారు.
భోజనం కావాలనుకుంటున్న కరోనా రోగులు ఉదయం 8 గంటల లోపు వివరాలు, చిరునామా చెబితే మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందిస్తామని సేవాసమితి సభ్యులు చెబుతున్నారు. రోడ్డు పక్కనున్న నిరాశ్రయులకు సాయంత్రం టిఫిన్ అందిస్తామని వివరించారు. ఆహారం కావాలనుకుంటున్న కరోనా బాధితులు 8501 8383 86 నెంబర్‌కి సమాచారం ఇవ్వాలని సేవాసమితి సభ్యులు తెలిపారు.