Sankalpa Siddhi Mart App Frauds: ప్రకాశం జిల్లా కనిగిరిలో సంకల్ప సిద్ధి మార్ట్ యాప్ మోసాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కనిగిరి పరిధిలో సంకల్ప సిద్ధి సంస్థ ఎర్రచందనం, శ్రీ గంధం మొక్కలను ఎరగా చూపి.. ప్లాట్ అగ్రిమెంట్లు రాయించి మోసగించారని బాధితులు వాపోయారు. సంస్థ యాప్‌లో సుమారు 200 మంది పెట్టుబడులు పెట్టామని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు.
సంకల్ప సిద్ధి యాప్‌తో మోసపోయిన వారు ఒక్కోక్కరుగా బయటకు వస్తున్నారు. తక్కువగా ఉన్నారనుకున్న బాధితుల సంఖ్య.. ఇప్పుడు దాదాపు 200 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఏ మోసం లేదని మొదట నమ్మించి.. సంకల్ప సిద్ధి ఏర్పాటు చేసిన ప్లాట్లను, ఆ ప్లాట్లలో వేసిన ఎర్రచందనం, శ్రీ గంధం మొక్కలను ఎరగా చూపెట్టి మోసాలకు పాల్పడ్డారని బాధితులు వాపోతున్నారు. లక్ష రూపాయలు చెల్లిస్తే మూడు వందల రోజుల వరకు.. రోజుకు వెయ్యి రూపాయల చొప్పున తమ పేరుపై యాప్‌లో జమ చేస్తామని తెలిపారని అన్నారు. దీనికోసం అగ్రిమెంట్లూ రాయించుకున్నారని తెలిపారు. బాధితులు ఒక్కొక్కరూ రూ.50 వేల వరకు సంస్థకు చెల్లించామని అన్నారు. మొదట యాప్‌లో తమ ఖాతాలో నగదు జమ చేసినా.. తర్వాత తగ్గిసూ వచ్చారని, సాంకేతిక సమస్యలు అంటూ పూర్తిగా జమ చేయడం మానేశారని వాపోయారు. అనుమానం వచ్చిన బాధితులు విజయవాడ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.