Samajika Sadhikara Bus Yatra in Kanigiri : సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వివిధ జిల్లాలో పర్యటిస్తున్నారు. తమ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఎమ్మెల్యేలు, మంత్రుల పర్యటన నేపథ్యంలో చేసే ఏర్పాట్లతో సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై సభలు పెట్టి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. అయినప్పటికీ... నాయకులు తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నేతలకు ఇబ్బందులు కలగకుండా... పోలీసులు వారి సభలు సజావుగా సాగేందుకూ బస్సు యాత్రకు రాచబాటలు వేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్పందన లేని సామాజిక సాధికార బస్సు యాత్ర..నిరాశతో వైసీపీ నాయకులు
ప్రకాశం జిల్లా కనిగిరిలో వైసీపీ బస్సు యాత్ర ప్రయాణికుల పాలిట శాపంలా మారింది. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారి అత్యుత్సాహం ప్రదర్శించారు. బస్సు యాత్ర నేపథ్యంలో కనిగిరి పట్టణానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో... బస్సులను ఎక్కడిక్కడే ఆపివేయడంతో ఆయా బస్సుల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వృద్ధులు, వికలాంగులు అటుగా వెళ్లలేమని పోలీసులను ప్రాధేయపడినప్పటికీ.. వారి అభ్యర్థనను పట్టించుకోలేదు. కనిగిరికి మూడు కిలోమీటర్ల దూరంలో బస్సులను నిలిపివేయడంతో.. చిన్న పిల్లల, వృద్ధులు మూడు కిలోమీటర్ల నడవలేక ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బస్సు ముందే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం సామాన్యులను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.