ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 18, 2020, 6:32 PM IST

ETV Bharat / state

నోట్ల సంగతి సరే.. మరి స్టిక్కర్ మాటేంటి..?

తమిళనాడు రాష్ట్రంలోని గుమ్మిడిపూండి సమీపంలో పోలీసులకు పట్టుబడిన రూ. 5.27 కోట్ల వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపుతూనే ఉంది. ఈ విషయమై తమిళ టీవీల్లో వార్తలు వెలువడ్డాయంటున్న వ్యాఖ్యానాలు రాష్ట్రంలో రాజకీయ వేడిని అమాంతం పెంచేశాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి, వైకాపా వాణిజ్య విభాగం నాయకుడు, ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో వైకాపా తరఫున కార్పొరేటర్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన నల్లమల్లి బాలరామగిరీష్‌ అలియాస్‌ నల్లమల్లి బాలు నోరు విప్పారు. తమిళనాడులో పట్టుబడిన సొత్తు తనదేనని అన్నారు. మార్చి నుంచి జులై వరకు లాక్‌డౌన్‌ సమయంలో తమ వ్యాపార లావాదేవీల్లో వచ్చిన సొత్తును బంగారం కొనుగోలుకు చెన్నైకి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడిందని, వారు ఐటీ శాఖకు అప్పగించారని పేర్కొన్నారు. ఆ సొత్తు తనదిగా గుర్తిస్తూ ఐటీ శాఖ తన పేరిటే నోటీసులు జారీ చేసిందంటూ సంబంధిత పత్రాలు చూపారు. తద్వారా నగదు రాజకీయ నాయకులకు సంబంధించింది అనే చర్చకు చెక్‌ పెట్టారు.

Rs 5.27 crore unaccounted money caught in Tamil Nadu creates ripples in andhrapradesh politics
Rs 5.27 crore unaccounted money caught in Tamil Nadu creates ripples in andhrapradesh politics

తమిళనాడులో నగదుతో పట్టుబడిన కారు మీద నా ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్నట్లు మీడియాలో వస్తోంది. అది ఒరిజినల్‌ కాదు.., ఫొటో జిరాక్స్‌ కాపీ. ఆ కారులో ఉన్న వ్యక్తులు ఒంగోలు వాసులు కావడంతో విషయాన్ని నాకు ఆపాదిస్తున్నారు. ఇది నాకు సంబంధించినది కాదు. అందులో రూ.అయిదు కోట్లున్నాయని చెబుతున్నారు. అది తమిళనాడు రిజిస్ట్రేషన్‌ వాహనం. దీనిపై పూర్తిగా దర్యాప్తు జరిపించాలి. ఎవరిది తప్పయితే.. వారిని శిక్షించాలని కోరుతున్నా...

- బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విద్యుత్తు, అటవీ శాఖామంత్రి (ఈ నెల 15న మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశం)

తమిళనాడులో డబ్బుతో పట్టుబడిన వాహనానికి నా పేరిట స్టిక్కర్‌ ఉందని నా దృష్టికి వచ్చింది. ఆ వాహనంతో, అందులో పట్టుబడిన నగదుతో, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. వారి చేతికి నా పేరిట ఉన్న స్టిక్కర్‌ ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. ఈ విషయంపై విచారణ చేపట్టమని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్నా. నా మీద, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపైనా ప్రతిపక్షం విమర్శలు దారుణం.

- అన్నా వెంకట రాంబాబు, ఎమ్మెల్యే, గిద్దలూరు (ఈ నెల 16న మీడియాకు విడుదల చేసి వీడియో సందేశం)

*తమిళనాడు రాష్ట్ర పరిధిలో కారుతో పట్టుబడిన డబ్బు పూర్తిగా నాదేే. అది లాక్‌డౌన్‌ సమయంలో మేం నిర్వహించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించినది. బంగారం కొనుగోలు నిమిత్తం వెళుతుంటే తమిళనాడు పోలీసులు పట్టుకుని ఆదాయపన్ను(ఐటీ)శాఖకు అప్పగించారు. ఆ డబ్బుకూ, రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ డ్రైవర్‌ ఏర్పాటు చేశాడు. లాక్‌డౌన్‌లో పోలీసు తనిఖీలు ఎక్కువగా ఉన్నాయని స్టిక్కర్‌ను వేశానని చెప్పాడు. అతనికది ఎలా వచ్చిందో నాకు తెలియదు. - నల్లమల్లి బాలరామగిరీష్‌ అలియాస్‌

- నల్లమల్లి బాలు, ఒంగోలుకు చెందిన బంగారు వ్యాపారి(శుక్రవారం ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు)

లోగుట్టు పెరుమాళ్లకెరుక..!

రహదారుల్లో పోలీసు తనిఖీలు, నగదు పట్టుబడటం తరచూ జరిగేదే, ఇదేమీ కొత్త విషయం కాదు. ఇక్కడ నగదు తరలిస్తున్న వాహనానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటంతోనే వాతావరణం వేడెక్కింది. రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపింది. ఆ డబ్బు రాజకీయ నాయకులది కాదు నాది అని నల్లమల్లి బాలు ప్రకటించారు. నగదు విషయాన్ని కాసేపు పక్కనపెడితే, ఆ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎలా వెళ్లింది, ఎవరి ద్వారా వెళ్లిందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కారు పట్టుబడిన తర్వాత తొలుత ఆ స్టిక్కర్‌ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిది అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ స్టిక్కర్‌ కథ గిద్దలూరు వైపు తిరిగింది. అది ఎలా ఆ కారుకు చేరిందో తమకు తెలియదని ప్రజాప్రతినిధులిద్దరూ ప్రకటించారు. ఆ డబ్బు తనదేనని ప్రకటించిన బాలు సైతం ఆ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎలా వచ్చిందో తనకూ తెలియదనే చెబుతున్నారు. విజయ్‌ అనే డ్రైవరు దాన్ని కారుకు అంటించినట్లు తెలిసిందని, అతనికి దాన్ని ఎవరిచ్చారో మాత్రం తనకు తెలియదని చెప్పడం విశేషం.

దర్యాప్తు సంస్థలు దృష్టి సారించేనా.?

ఇప్పుడీ కారు స్టిక్కర్‌ వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు రిజిస్ట్రేషన్‌ కారుకు ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే.. అందునా ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి స్టిక్కర్‌ ఎలా చేరిందనేని ఇప్పుడు అర్థంకాని విషయంగా మారింది. ఆ కారు తమ బందువులదని బాలు కథనం. బంధువులకు చెందిన కారులో, అందునా ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారులో ఎలాంటి లెక్కాపత్రాలు లేకుండా రూ.కోట్ల నగదు ఎలా తరలిస్తారు. వందేళ్ల వ్యాపార చరిత్ర ఉన్న కుటుంబానికి పత్రాలు లేకుండా భారీ మొత్తం నగదురూపేణా తరలించకూడదనే విషయం తెలియదా..? అందుకోసం ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న వాహనం వినియోగించుకోవడం నేరం అనే విషయం తెలియకుండానే ఇదంతా జరిగిపోయిందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటి వరకు కథంతా కేవలం నగదు ఎవరిదనే అంశం చుట్టూనే తిరుగుతోంది. దర్యాప్తు సంస్థలు ఆ వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎలా వచ్చింది. ఎన్నాళ్ల నుంచి తిరుగుతోంది, ఎందుకోసం తిరుగుతోందనే విషయాలపై దృష్టి సారిస్తే అసలు కథ వెలుగుచూసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: గవర్నర్​ వద్దకు ఆ 2 బిల్లులు.. తిరుగుతున్నాయి ఎన్నో మలుపులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details