మరో గంటలో పెళ్లి. పెళ్లి కుమార్తె తరఫు బంధువులంతా ఆనందంగా మండపానికి బయల్దేరారు. ఇంతలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమార్తెతో పాటు బంధువులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం చాకిచర్లకు చెందిన వధువుకు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. పొదిలి సమీపంలోని నరసింహ స్వామి కొండపై 11 గంటలకు ముహుర్తం ఖరారు చేశారు. ముహుర్తం సమయం దగ్గరపడటంతో చాకిచర్ల నుంచి ట్రాక్టర్లో పెళ్లి కుమార్తెతో పాటు బంధువులు పెళ్లి మండపానికి బయల్దేరారు. ఘాట్ రోడ్డు, రహదారి సరిగా లేకపోవడం, ములుపులతో కొండ సమీపంలోకి రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో దేవమ్మ, కమలమ్మ అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. అటుగా వెళ్తున్న స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో పెళ్లి కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ప్రమాదంతో పెళ్లి తాత్కాలికంగా నిలిచిపోయింది.