ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం చౌట గోగులపల్లిలో నాలుగేళ్ల క్రితం తల్లి.. ఇటీవల కరోనాతో తండ్రి చనిపోయి అనాథలైన ఇద్దరు చిన్నారులకు సాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. చిన్నారులు సిద్ధార్థ, శ్రీనవ్య దీనస్థితిపై "కుటుంబంలో కరోనా మిగిల్చిన శోకం.. పిల్లల భవిత ప్రశ్నార్థకం" అనే కథనాన్ని ఈటీవీ భారత్ ప్రసారం చేసింది. కథనానికి స్పందించిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే, తెదేపా ఇంఛార్జ్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి రూ. 20 వేల నగదుతో పాటుగా నిత్యావసర సరుకులను కార్యకర్తల ద్వారా అందజేశారు. చిన్నారులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
కనిగిరి తహసీల్దార్ పుల్లారావు రూ.3 వేలు, పామూరు మాజీ ఎంపీపీ పువ్వాడి రాంబాబు, సింగిల్ విండో ఛైర్మన్ వెంకట సుజాత.. చిన్నారుల ఆన్లైన్ చదువుల నిమిత్తం రూ. 10 వేలు, ఆల్ఫా విద్యాసంస్థల అధినేత మాలకొండారెడ్డి రూ.10 వేలు అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.