ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల వెల్ఫేర్, ఎడ్యుకేషన్ సహాయకులు, అగ్రికల్చర్ సహాయకులు సహా వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి ఆదిమూలపు సురేశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగుల ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగావకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాటు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ... ప్రజలకు సేవలు అందించి ప్రజా ప్రభుత్వంగా గుర్తింపు పొందిందన్నారు. రాబోయే రోజుల్లో సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి మరింత కీర్తి తీసుకురావాలని మంత్రి సూచించారు.
రైతులకు సక్రమంగా అందించాలి..
విద్యా వాలంటీర్లు పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై శ్రద్ధ చూపాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యా పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సహాయకులు, సిబ్బంది సమన్వయం చేసుకుంటూ రైతులకు అందాల్సిన రాయితీలు సక్రమంగా అందించాలని ఆదేశించారు.