రాష్ట్రంలో ఆర్టీసీ అద్దెబస్సుల సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. సెప్టెంబర్ 1 నుంచి అద్దెబస్సులు తిప్పేందుకు ఇటీవల ఆర్టీసీ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈటీవీ భారత్, ఈనాడు, ఈటీవీలో వచ్చిన కథనానికి స్పందించిన విజయవాడలోని ఆర్టీసీ ఆపరేషన్ ఈడీవో.. అద్దెబస్సుల యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల నుంచి గతంలో తిరిగిన రూట్లలో యథావిధంగా బస్సులు తిప్పేందుకు సమ్మతి తెలిపారు.సాంకేతిక తనిఖీల అనంతరం తిప్పెందుకు అనుమతులు జారీ చేస్తామన్నారు.
ఈ నిర్ణయంతో ప్రకాశం జిల్లాలోని 170 బస్సుల్లో ఒక ఇంద్రా(ఎసి) బస్సు మినహా మిగిలిన..అన్ని సర్వీసులు దాదాపుగా రోడ్లెక్కనున్నాయి. అయితే ఇందులో 15 అద్దె బస్సులకు అగ్రిమెంట్ గడువు ముగిసింది. కొవిడ్ కారణంగా పూర్తిస్థాయిలో సర్వీసులు తిప్పకపోడంతో ఆర్థికంగా నష్టపోయామని.. కొన్నాళ్లు కొనసాగించాలని సంఘ ప్రతినిధులు కోరడంతో అధికారులు సానుకూలంగా స్పందించారు. మరో ఏడాదిపాటు సర్వీసులు తిప్పుకునేందుకు అనుమతించారు. అయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉంది. తొలివిడతలో జిల్లా 8 డిపోల్లో పిరిధిలోని 157 బస్సులు తిరగనున్నాయి. కొనసాగింపు ఉత్తర్వులు వచ్చిన వెంటనే మిగిలిన రూట్లలో సర్వీసులు పునరుద్దరిస్తారు.