రైతు పొలంలో ఎర్రచందనం చెట్లు చోరీ
ఓ రైతు పొలంలోని ఎర్ర చందనం చెట్లను దుండగులు రాత్రికి రాత్రే దొంగిలించారు. రంపంతో కోసేసి 4 చెట్లను ఎత్తుకెళ్లారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని కంది కొండారెడ్డి అనే రైతు పొలంలో ఎర్రచందనం చెట్లను దుండగులు దొంగిలించారు. తనకున్న రెండు ఎకరాల పొలం గట్లపై 25 సంవత్సరాల క్రితం రైతు 10 ఎర్ర చందనం మొక్కలు నాటారు. ప్రస్తుతం వీటిలో ఆరు పెద్ద మానులుగా మారాయి. విలువైన సంపద అయినందున గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే వీటిని దొంగిలించారు. రంపంతో కోసుకుని నాలుగు చెట్లను దొంగిలించి.. ఒక చెట్టును అక్కడే వదిలి వెళ్లారు. ఎన్నో ఏళ్లుగా వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చానని ఇలా దొంగలపాలవుతాయని అనుకోలేదని రైతు కొండారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై స్థానిక పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.