బియ్యం, పప్పులు, కూరగాయలు తినే ఎలుకల గురించి మనకు తెలుసు. బీరువాలో పెట్టుకొన్న దుస్తుల్ని కొట్టే మూషికాల గురించీ తెలుసు. కానీ.. మద్యం తాగే ఎలుకల్ని చూసి ఉండరు. అది కూడా.. సీసాలకు సీసాలు తాగే ఎలుకల గురించి మాట మాత్రం కూడా విని ఉండరు. కానీ.. ఇలాంటి ఎలుకలు కావాలంటే ప్రకాశం జిల్లా అద్దంకి వెళ్లొచ్చు. ఎందుకంటే.. అక్కడి మద్యం దుకాణాల్లోని మద్యాన్ని ఎలుకలు తాగుతున్నాయట. నిల్వల్లో ఎందుకు తేడా వచ్చింది అని ప్రశ్నించిన అధికారులకు సదరు షాపు నిర్వాహకులు చెప్పిన మాట ఇదే మరి.
ఈ సమాధానం విని నివ్వెరపోవడం అధికారుల వంతయ్యింది. అద్దంకి సర్కిల్ పరిధిలోని మొత్తం 30 దుకాణాలకు గాను 13 చోట్ల నిల్వల్లో వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. ఇలాంటి సమాధానాలపై కఠినంగా స్పందించారు. వివిధ దుకాణాల్లో పని చేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ మద్యం సీసాలను ఇళ్లకు తరలించి అధిక ధరలకు విక్రయించారనే ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై అద్దంకి ఎక్సైజ్ సీఐ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. మద్యం నిల్వల్లో వ్యత్యాసం వాస్తవమేనని చెప్పారు. విచారణ చేపట్టి ఆయా దుకాణాల్లో పని చేసే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.