RAMAYAPATNAM PORT: ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గుడ్లూరు మండలంలోని కర్లపాలెం, ఆవులవారిపాలెం, మొండివారిపాలెం, సాలిపేటలో 823 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వ భూములతో పాటు పట్టా, అసైన్డ్, సముద్ర పోరంబోకు భూములు ఉన్నాయి. భూసేకరణలో భాగంగా రొయ్యల చెరువులకు ఎకరాకు 15 లక్షలు, మిగిలిన భూములకు ఎకరాకు 10 లక్షలు చొప్పున ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా...పోర్టు నిర్మాణం పనులు ప్రారంభంకాకపోవడంతో...పరిహారం సైతం పూర్తిగా ఇవ్వలేదు. అయితే గతంలో చేసుకున్న ఒప్పందాన్ని కాదని పరిహారం సొమ్ము తక్కువ ఇస్తామనని అధికారులు చెప్పడంపై స్థానికులు మండిపడుతున్నారు.
పోర్టు కోసం ఈ ప్రాంతంలో 482 కుటుంబాలను ఖాళీ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఇళ్లను గుర్తించి నెంబర్లు వేశారు. అయితే ఇళ్లకు పరిహారంతోపాటు పునరావసంపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు.ఎంత స్థలం ఇస్తారు..? ఇళ్లు కట్టిస్తారా లేక డబ్బులిచ్చి తమనే కట్టుకోమంటారా అన్నది తేల్చలేదని స్థానికులు చెబుతున్నారు. నిబంధనల మేరకు కొన్ని భూములకు పరిహారం అందకపోయినా... రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చెల్లింపులు చేస్తామని అధికారులు చెబుతున్నారు.