ఏపీలో రైతాంగ ఉద్యమ స్ఫూర్తి బలంగా ఉంది.. అమరావతికి భూములిచ్చిన అన్నదాతలు నిర్విరామంగా పోరాడుతూనే ఉన్నారని దిల్లీ రైతాంగ పోరాటానికి సారథ్యం వహిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ సింగ్ టికాయిత్ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో 144 రోజులుగా రైతాంగం చేస్తున్న పోరాటానికి రైతులు, కార్మికులతోపాటు ప్రజలంతా మద్దతిచ్చి దేశవ్యాప్త ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి, ఏపీ కిసాన్‌మోర్చాల ఆధ్వర్యంలో ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన విజయవాడ, ఒంగోలుల్లో సోమవారం నిర్వహించిన కార్మిక- కర్షక సదస్సుల్లో టికాయిత్ మాట్లాడారు. ‘వ్యవసాయ రంగాన్ని అంబానీ, అదానీ తదితర బడా కార్పొరేట్లకు కట్టబెట్టి రైతులను వారికి బానిసలుగా మార్చడమే ఈ నల్లచట్టాల ఉద్దేశం. మండీలు, కొనుగోలు కేంద్రాలు మూతపడటంతో వ్యవసాయ ఉత్పత్తులు భద్రపర్చుకోలేని పరిస్థితులు వచ్చాయి. కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది’ అన్నారు. దేశాన్ని పాలిస్తున్న ప్రైవేట్ శక్తుల కోసం తీసుకొచ్చిన ఈ చట్టాలను రద్దు చేసే వరకు పోరాడదామన్నారు. దిల్లీలో సాగుతున్న ఉద్యమానికి మద్దతుగా జిల్లా, మండల కేంద్రాల్లోనూ ట్రాక్టర్లతో రైతులు ఉద్యమించాలని, మహిళలూ వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో అన్ని రంగాల సమస్యలపైనా పోరాడతామని ఆయన ప్రకటించారు.
నల్లచట్టాలతో 81 కోట్ల మందికి రేషన్ రద్దు!
అయిదు నెలలుగా దిల్లీలో సాగుతున్న పోరాటంలో 370 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వంలో చలనం లేదని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేసీ) జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలె మండిపడ్డారు. ‘కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 4లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందులో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల వారే ఎక్కువమంది. వ్యవసాయ నల్లచట్టాలు అమల్లోకి వస్తే 81 కోట్ల మందికి అతి తక్కువ ధరలకే ఇస్తున్న రేషన్ రద్దవుతుంది. ఆకలి చావులు మరింత పెరుగుతాయి. కరోనా కష్టకాలంలో దేశ ప్రజల జీవనం అస్తవ్యస్తమైతే.. అంబానీ, అదానీల ఆస్తులు మాత్రం 50 శాతం పెరిగాయి’ అని ధ్వజమెత్తారు. దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వం కార్మికులు, కర్షకులు, సామాన్యులను మరింత దారిద్య్రంలోకి నెడుతోందని ఏఐకేఎస్ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షులు బల్కరణ్ సింగ్ బ్రార్ విమర్శించారు. పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలన్నారు.
విశాఖ ఉక్కు- దేశ ప్రజల హక్కు