ప్రకాశం జిల్లాలో తుపాను ప్రభావం - విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు Rains in prakasam due to Michaung Cyclone: మిగ్జాం తుపాను(Michaung Cyclone) ప్రభావంతో రాష్ట్రంలో చాలాచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తుపాను ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం, అధికారిక యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావిత జిల్లాలలో ఎన్డీఆర్ఎఫ్(NDRF), ఎస్డీఆర్ఎఫ్(SDRF) బృందాలను మోహరించారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు మిగ్జాం తాకిడికి పునరావాస కేంద్రాలకు పయనమయ్యారు. సముద్ర వేట ప్రధాన వృత్తిగా జీవించే వారు పడవలు మలుపుకుని తీరానికి చేరుకుంటున్నారు.
ప్రకాశం జిల్లాలో తీర ప్రాంత మండలాల్లో తుపాను ప్రభావంతో వర్షం,చలిగాలులతో వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు, నాగులప్పలపాడు తదితర మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి.
మిగ్ జాం తుపాను ప్రభావం - గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వర్షాలు
ఆందోళనలో అన్నదాతలు: ప్రకాశం జిల్లాలో ఉప్పు మడులు నీటితో నిండిపోయాయి. తుపాను కారణంగా పొగాకు,సెనగ పంటలకు కారణంగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతువ్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సచివాలయ సిబ్బందినుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరూ సెలవులు తీసుకోవద్దని కలెక్టరు ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్, ఆర్డీఓ విశ్వేశ్వరరావు తదితరులు తీరప్రాంత మండలాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం, మండలాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలో మురుగు కాలువలులో చెత్త పేరుకుపోకుండా పూడికలు తొలగింపు కార్యక్రమం చేపట్టారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని లోతట్టు కాలనీవాసుల జాబితా సేకరించారు. వరద ముప్పు తలెత్తితే వెంటనే పునరావస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు.
తుపాను కారణంగా జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. మత్స్యకారులకు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. పడవలను, వలలను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాగార్జున విశ్వ విద్యాలయం రెండు సంవత్సరం పరీక్షలు వాయిదా వేశారు. గత కొన్నేళ్లుగా సముద్రంలో ఇంత అలజడి చూడలేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు.
సీఎం సమీక్ష: తుఫాను ప్రభావిత 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు,ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తుపాను దృష్ట్యా చేపడుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉంటూ, యంత్రాంగం సీరియస్‌గా ఉండాలని సీఎం నిర్దేశించారు. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారని, అప్పుడు గంటకు 110 కిమీ వేగంతో ఈదురు గాలులు వీయడం సహా వర్షాలు కురుస్తాయని సీఎం తెలిపారు. జిల్లాల కలెక్టర్లు అత్యవసర ఖర్చుల కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు చొప్పున నిధులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. తిరుపతికి రూ. 2 కోట్లు, మిగిలిన జిల్లాల్లో 1 కోటి చొప్పున ఇచ్చారని, మిగిలిన జిల్లాలకు కూడా మరో కోటి రూపాయలు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం తెలిపారు.
దూసుకొస్తున్న మిగ్జాం తుపాను- ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు