నివర్ తుపాను కారణంగా ప్రకాశం జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంతంలోని 11 మండలాల్లో ఎడతెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఒంగోలులోని ప్రధాన వీధులన్నీ జలమయమవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన చలిగాలులు ప్రజల్ని వణికిస్తున్నాయి. ఒంగోలు, చీరాల, వేటపాలెం, గుడ్లూరు, సింగరాయకొండ సహా తీరమండలాల్లోని 40 గ్రామాల్లో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. మండలానికి ఓ ప్రత్యేక అధికారిని ఏర్పాటుచేసి సహాయకచర్యలు చేపట్టేందుకు అప్రమత్తం చేశారు
వరుణుడి బీభత్సం.. నీట మునిగిన పంటలు - నివర్ తుపాన్ అప్డేట్స్
నివర్ తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంటలు నీట మునిగాయి
వాణిజ్య, మెట్ట పంటలకు తీవ్ర నష్టం కలిగింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుసిన వర్షాలకు పంటలు నీట మునిగాయి. కొండెపి, సింగరాయి కొండ, కందుకూరు, టంగుటూరు మండలాల్లో మినముకు తీవ్ర నష్టం ఏర్పడింది. దాదాపు మూడు వేల ఎకరాల్లో మినుము పంట నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పరుచూరు, కారం చేడు, మార్టూరు, చీరాల, మార్కాపురం, ఎర్రగొండపాలెం మండలాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. వర్షాలు తగ్గితే గానీ జిల్లాలో పంట నష్టం అంచనాలకు రాలేమని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: తీరం దాటిన 'నివర్'... తీర ప్రాంతంలో అప్రమత్తం