Rabbits And Calf House: కరోనా కారణంగా గత రెండేళ్లుగా పాఠశాలలకు సెలవులు వచ్చాయి. ఆ సమయంలో చిన్నారులకు చదువులు చెప్పడం, వారి అల్లరిని భరించడం తల్లిదండ్రులకు పెద్ద పనిగానే మారిందని చెప్పాలి. ఇలాంటి అల్లరి పిల్లల కోవకి చెందిన వారే ప్రకాశం జిల్లా అద్దంకి చెందిన ఇద్దరు అమ్మాయిలు శివ నాగ సమీరా, శివ జ్యోతిక. కొవిడ్ తో పాఠశాలలు మూసివేయడంతో ఇంటి వద్దే ఉంటూ చదువుతో పాటు ఆటలు పాటలూ కొనసాగించారు. చదువు సంధ్యలతో పాటుగా అల్లరిలో కూడా ముందున్నారు. పిల్లల దృష్టి అల్లరిపై నుంచి మరల్చేందుకు వారి కోసం రెండు బుజ్జి బుజ్జి.. ముద్దు ముద్దు కుందేలు పిల్లల్ని తెచ్చారు సమీరా, జ్యోతికల తండ్రి గోనుగంట సుబ్బారావు.
కొత్తగా వచ్చిన నేస్తాలతో ఆడుతూ...వాటిని అల్లారుముద్దుగా పెంచుతూ వారి నాన్నలాగే సమీరా, జ్యోతిక జంతు ప్రేమికులుగా మారిపోయారు. రెండేళ్లలో మొత్తం 50కి పైగా కుందేళ్లను పెంచుతూ జంతు ప్రేమను చాటుతున్నారు. అంతేనా కేవలం కుందేళ్లే కాదు వీరి ఇంట్లో ఆవు దూడలు కూడా ఉన్నాయి. కుందేళ్లు, దూడలు కలిసి మెలిసి పచ్చిక తింటూ..ఎంతో స్నేహంగా మెలుగుతాయి.