వృద్ధులను, చదువురాని వారిని మోసం చేస్తూ వారి ఏటీఎం కార్డులతోనే డబ్బుల్ని కాజేసిన ఘరానా దొంగను ప్రకాశం జిల్లా మార్టూరులో పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలోని కృష్ణలంకకు చెదిన చింతల సురేశ్ (44).. ఏటీఎం కేంద్రాల వద్ద మాటు వేసి వృద్ధులు, చదువురాని వారు వస్తే వారి వద్ద నుంచి కార్డులు తీసుకునేవాడని.. తర్వాత తన వద్ద ఉన్న నకిలీ కార్డులు వారి చేతిలో పెడతాడని తెలిపారు. అనంతరం.. ఆ కార్డులతో డబ్బులను కాజేస్తాడని వెల్లడించారు.
ఇతనిపై గుంటూరు జిల్లా తెనాలి, కృష్ణా జిల్లా గన్నవరం, గుడివాడ, హనుమాన్ జంక్షన్, అగిరిపల్లి, నూజివీడు ప్రాంతాల్లోనూ ఏటీఎం కార్డులు మార్చి నగదు అపహరించిన కేసులు ఉన్నాయని చెప్పారు. జైలుకు వెళ్లి వచ్చాక కూడా మళ్లీ అదే పని చేస్తున్నాడని తెలిపారు. ఇతని వద్ద నుంచి రూ.1.43 లక్షల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసుని ఛేదించిన పోలీసులను చీరాల డీఎస్పీ అభినందించారు.