బ్రిటిష్ కాలంలో భూమి శిస్తు ద్వారానే అధిక ఆదాయం వచ్చేది. అప్పట్లో కొందరు రైతులు శిస్తు చెల్లించలేకపోయారు. 1910లో సర్వే ఆధారంగా కొలతలు వేసిన రెవెన్యూ అధికారులు... రికార్డుల్లో నమోదు చేయని భూములకు చుక్కలు పెట్టి వదిలేశారు. అలా శిస్తు కట్టలేక వదిలివేసిన భూములు రికార్డుల్లో చుక్కల భూములుగా నమోదయ్యాయి. ఈ భూములకు హక్కుదారులు ఉన్నా... నిషేధిత ప్రభుత్వ భూముల జాబితాలో చేరాయి. ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్నా.. హక్కులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
వందేళ్ల నాటి చుక్కల భూముల సమస్య పరిష్కారం కోసం ఎంతో మంది అధికారులకు రైతులు మొరపెట్టుకున్నా.. ప్రయోజనం మాత్రం శూన్యం. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 70 వేల ఎకరాలు చుక్కల భూములు ఉన్నాయి. కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోని 24 మండలాల్లో రైతులు ఈ భూముల సమస్యతో అల్లాడిపోతున్నారు.