ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ ఎన్నికలు ఎంతో ఉత్కంఠభరితంగా జరిగాయి. 13 వార్డులలో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ పెట్టెలలో నిక్షిప్తమై ఉంది. అత్యంత భద్రత నడుమ, సీసీ కెమెరాల నిఘా నీడలో ఉన్న స్ట్రాంగ్ రూముల్లో అధికారులు భద్రపరిచారు. ఇరు పార్టీల తరుఫున పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపోటములు తేలడానికి మరొక రోజే ఉంది. నగర పంచాయతీలో 13 వార్డుల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యంపై ప్రజల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
పోలింగ్ శాతం ఎక్కువగా ఉన్న వార్డులు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. రెండు ప్రధాన పార్టీలు అత్యధిక స్థానాలు తమవంటే తమవంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ఛైర్మన్ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించారు. తెదేపా బహిర్గతం చేయలేదు. కనిగిరి మోడల్ స్కూల్లోని స్ట్రాంగ్ రూముల వద్ద బ్యారీ గేట్ల నిర్మాణ పనులను ఎన్నికల అధికారి, నగర పంచాయతీ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు శుక్రవారం పరిశీలించారు.