ప్రకాశం జిల్లాలో రాజకీయ చైతన్యం బాగానే ఉంటుందనే చెప్పాలి. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు నువ్వా-నేనా అన్నట్లుగా ఎన్నికల సమయంలో పోటాపోటీగా పని చేస్తుంటారు. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో తొలితరంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఛైర్మన్‌గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఒక్కసారి మినహా మిగతా అన్ని ఎన్నికల్లోనూ ఈ పార్టికి చెందినవారే ఛైర్మన్‌గా పనిచేస్తూ వచ్చారు. ఒంగోలు జిల్లాగా ఏర్పడే నాటికి దిరశాల వెంకటరమణారెడ్డి చైర్మన్‌గా వ్యవహరించేవారు. తరువాత ఏడాది పాటు పోతులు చెంచయ్య పని చేశారు.
1981 నుంచి 83 వరకూ కేశరాపు రామలింగారెడ్డి కాంగ్రెస్ తరఫున చైర్మన్‌గా పని చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు అన్నిసార్లు ఆ పార్టీకే ఛైర్మన్ పదవి దక్కుతూ వచ్చింది. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మార్టూరు నుంచి ఎన్నికైన గొట్టిపాటి హనుమంతరావు.. ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గబాటి వెంకటేశ్వరరావు కోసం ఎన్నికలు జరిగిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇందుకు ప్రతిఫలంగా ఆ వెంటనే జరిగిన జెడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గొట్టిపాటికి పోటీగా నిలపడం, గెలిచి ఛైర్మన్ పదవి దక్కించుకోవడం జరిగింది.
1985-86లో చప్పడి వెంకయ్య, 1987-92 సంవత్సరంలో అదే పార్టీ నుంచి గుత్తా వెంకట సుబ్బయ్య పనిచేశారు. 1992-95 వరకూ ప్రత్యేక అధికారుల పాలన సాగింది. 1995 జరిగిన ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వు కావడంతో డేవిడ్ రాజు ఛైర్మన్‌గా ఐదేళ్లు పని చేశారు. 2001లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీయే ఛైర్మన్ పదవి కైవశం చేసుకుంది. ఐదేళ్లపాటు ముక్కు కాశిరెడ్డి పని చేశారు. 2006-11 కాలంలో బీసీలకు రిజర్వు కావడంతో కాటం అరుణమ్మ కాంగ్రెస్ తరఫున ఛైర్మన్‌గా పని చేశారు. రాష్ట్ర విభజన తరువాత వచ్చిన 2013 తొలి ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ ఏర్పడింది. ఫలితాలు మాత్రం 2014 జూన్‌లో వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో 56 మండలాల్లో 31 జెడ్పీటీసీలు వైకాపా గెలుచుకోగా, తెలుగుదేశం పార్టీ మాత్రం 25 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.
వాస్తవానికి వైకాపాకు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఛైర్మన్ పదవి కోసం వ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు వేసి విశ్వప్రయత్నాలు చేసింది. అప్పట్లో తెలుగుదేశం తరఫున ఈదర హరిబాబు, డా. మన్నె రవీంధ్ర పేర్లు ప్రతిపాదనకు వచ్చాయి. వైకాపా నుంచి నలుగురు జడ్పీటీసీలను ఫిరాయించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. వైకాపా నుంచి నూకసాని బాలాజీ పోటీ పడ్డారు. చివరి క్షణంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానవర్గం మాటను ధిక్కరించి ఈదర హరిబాబు వైకాపా సభ్యుల సహకారంతో ఛైర్మన్ పదవిని కైవసం చేసుకొని అందరినీ ఖంగు తినిపించారు. ఛైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు, పోలీసుల లాఠీఛార్జీలు వంటి సంఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వైకాపాలో ఛైర్మన్ పదవి ఆశించిన నూకసాని బాలాజీ ఆ పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరారు. హరిబాబును తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్లడంతో పార్టీ విప్ ఉల్లంఘన అంశంపై హరిబాబు నెల రోజులకే పదవి కోల్పోవలసి వచ్చింది.
తెలుగుదేశం మద్దతుతో నూకసాని బాలాజీ ఛైర్మన్ పదవి చేపట్టారు. ఆయన కూడా ఏడాది మాత్రమే ఛైర్మన్‌గా వ్యవహరించారు. హరిబాబు హైకోర్టుకు వెళ్లి.. మళ్లీ.. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి, పదవీకాలం పూర్తయ్యేంత వరకూ బాధ్యతలు నిర్వహించారు. ఐదేళ్లలో వివాదాలు, సహాయ నిరాకరణలు, అధికారులకు, ఛైర్మన్‌ల మధ్య వాగ్యుద్దాలు వంటి వాటితోనే కాలం గడిచిపోయింది.
గతేడాది జట్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం, నామినేషన్లు వేసి ఇరు పార్టీలు పోటీకి తలపడ్డాయి. అయితే కొవిడ్ కారణంగా వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ తాజాగా మెుదలైంది. అప్పట్లో నామినేషన్ల సమయంలోనే అనేక గొడవలు, బెదిరింపులు, అక్రమ కేసులు వంటి సంఘటనలు జరగడంతో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు భయబ్రాంతులకు గురయ్యారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో అదే తీరు కనపడటంతో తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికలపై అసంతృప్తితో ఉంది. కొత్త నోటిఫికేషన్ వేయనందున ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జడ్పీ చైర్మన్ పదవి విషయంలో అధికార పార్టీకి ఏకపక్ష విజయం లభిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. జడ్పీ పీఠం ఓసీ మహిళకు కేటాయించడంతో ఛైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి సతీమణి బూచేపల్లి వెంకాయమ్మ పేరు దాదాపు ఖరారు చేశారు.
ఇదీ చదవండి:నాపై చేసినవన్నీ నిరాధార ఆరోపణలే.. అవే వివరించా: ఏబీ వెంకటేశ్వరరావు