ప్రకాశం జిల్లాలో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి, వారిని బడిలో చేర్పించే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ పోల భాస్కర్ అన్నారు. ఈ మేరకు "మన బడికి పోదాం" అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 23 నుంచి ఇందుకు సంబంధించిన సర్వే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఇందుకోసం ఏర్పాటు చేసిన యాప్‌లో వివరాలు పొందుపరచాలన్న ఆయన... ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మహిళా శిశు సంక్షేమ అధికారులు, వార్డు వాలంటీర్లు, కార్మికశాఖ అధికారులు పాల్గొనాలని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సర్వే చేపట్టాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ చేతన్, డీఈఓ సుబ్బారావు పాల్గొన్నారు.