అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు ఇచ్చే పాలు.. బహిరంగ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. కొందరు అంగన్‌వాడీ టీచర్లు, దుకాణ యజమానులతో చేతులు కలిపి పాల దందాను కొనసాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో అధికారులకు అందిన సమాచారం మేరకు ఓ దుకాణంలో దాడి చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం రాత్రి ఒకటో పట్టణ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ పి.శ్రీకాంత్ వెల్లడించారు.
చీరాల మార్కెట్ సమీపంలోని రాజ్యలక్ష్మి స్టోర్స్‌లో రెవెన్యూ, ఐసీడీఎస్, పోలీసులు.. దాడులు చేశారు. తనిఖీల్లో మొత్తం 15 పెట్టెల్లో 180 ఎంఎల్ పరిమాణమున్న 467 అంగన్‌వాడీ పాల ప్యాకెట్లు దొరికాయి. చీరాల అర్బన్ సీడీపీవో నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, వ్యాపారులను అరెస్టు చేశారు.
చీరాల గ్రామీణ ప్రాంతంలో ఉన్న పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో అదే ప్రాంతానికి చెందిన చిన్ని గంగాధర్ అనే వ్యక్తి... 8 మంది అంగన్‌వాడీ టీచర్ల నుంచి పాలప్యాకెట్లు సేకరించి దుకాణాల్లో విక్రయాలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. గంగాధర్ భార్య నాగదివ్య కూడా అంగన్‌వాడీ టీచర్ కావటంతో పాల దందాను సులువుగా చేశారన్నారు. ఒక్కో పెట్టెను రూ.500లకు టీచర్ల వద్ద కొనుగోలు చేసి కొంత లాభంతో దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.