ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tdp leaders letter to CM: 'వెలిగొండను కేంద్ర గెజిట్‌లో చేర్చండి' - Veligonda project latest news

వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర గెజిట్‌లో చేర్చాలని కోరుతూ.. ప్రకాశం జిల్లా తెదేపా నేతలు సీఎం జగన్​కు లేఖ రాశారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్‌లో వెలిగొండను అనుమతులు లేని ప్రాజెక్టుగా చూపడం విభజన చట్టానికి పూర్తి విరుద్ధమన్నారు.

Veligonda project
వెలిగొండ ప్రాజెక్టు

By

Published : Jul 17, 2021, 8:28 AM IST

వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర గెజిట్‌లో చేర్చాలని ప్రకాశం జిల్లా తెదేపా శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు (పర్చూరు), డోలా బాల వీరాంజనేయస్వామి (కొండపి), గొట్టిపాటి రవికుమార్‌(అద్దంకి)లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్‌లో వెలిగొండను అనుమతులు లేని ప్రాజెక్టుగా చూపడం విభజన చట్టానికి పూర్తి విరుద్ధమన్నారు.

ప్రకాశం జిల్లాలోని ఆరు, నెల్లూరు జిల్లాలో రెండు, కడప జిల్లాలో ఒక నియోజకవర్గానికి తాగు, సాగు నీటిని అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు అన్యాయం చేయొద్దని కోరారు. ఈనెల 11వ తేదీన రాయలసీమ ఎత్తిపోతలతో జిల్లాకు కలిగే నష్టాలపై లేఖ రాశామని, దానిపై ప్రభుత్వం నుంచి స్పందన రాలేదన్నారు. ఆ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తూ కీలకమైన వెలిగొండ సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నామని, వెంటనే స్పందించాలని విన్నవించారు. సమస్యను పరిష్కరించకుంటే పోరాటం చేయడానికి వెనుకాడమని హెచ్చరించారు.

నాటి అనుమతులు ఇప్పుడేమయ్యాయి..!

‘కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌తో తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులు, నీటి ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న, పూర్తయిన ప్రాజెక్టులు మాత్రమే విభజన చట్టంలో ఉన్నట్లు ఇందులో పేర్కొన్నారు. ఇది 2014 నాటి విభజన చట్టానికి పూర్తి విరుద్ధం. ఈ చట్టంలోని 11వ షెడ్యూల్‌, సెక్షన్‌ 85 (7ఈ)లో నీటి ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణంపై స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం ఉభయ రాష్ట్రాల్లోని హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు అనుకున్న ప్రకారమే పూర్తిచేయాలి. అయితే తాజా నోటిఫికేషన్‌లో 5 ప్రాజెక్టులనే చూపించి వెలిగొండను వదిలేశారు. నాడు అన్ని అనుమతులు ఉన్నాయి, పూర్తిచేయాలని విభజన చట్టంలో పేర్కొని ఇప్పుడు ఆరునెలల్లో అనుమతులు తీసుకోవాలని పేర్కొనడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాతికేళ్లుగా నిర్మాణంలో ఉండి, ప్రాజెక్టు చివరి దశలోకి చేరుకున్న తరుణంలో ఇలాంటి చర్యల వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుంది’ అని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్రీశైలం వద్ద తెలంగాణ చేపట్టిన మూడు ప్రాజెక్టుల ద్వారా 14 వేల క్యూసెక్కులు, రాయలసీమ ఎత్తిపోతల వల్ల 80 వేల క్యూసెక్కులు 805 అడుగుల వద్దనే మళ్లించడం వల్ల వెలిగొండకు నీరు చేరే అవకాశం లేదని శాసనసభ్యులు లేఖలో ప్రస్తావించారు.

వారు చేసిన డిమాండ్లు ఇలా ఉన్నాయి..

*వెలిగొండ ప్రాజెక్టుని వెంటనే కేంద్ర గెజిట్‌లో చేర్చాలి. అన్ని అనుమతులు ఉన్నాయని మళ్లీ గెజిట్‌ నోటిఫికేషన్‌ వచ్చేలా చూడాలి.

*ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పి...రెండేళ్లైనా ఇంకా మాటమారుస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా వెంటనే పూర్తిచేయాలి.

*వెలిగొండ భవిష్యత్తుకు, నాగార్జున సాగర్‌ మనుగడకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం చూసి ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతులకు నీరివ్వాలి. అలాగే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై పునరాలోచించాలి.

ఇదీ చదవండి:

'రహస్య ఒప్పందాలు మానండి.. విశాఖ ఉక్కు పరిరక్షణకు ముందుకు రండి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details