Telugu Students in Ukraine: ఓ పక్క యుద్ధం.. బాంబుల మోత.. మరోపక్క విమానాల రద్దు.. వెనక్కి వెళ్లే అవకాశం లేక ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. మైనస్ 2 డిగ్రీల చలిలో, తాగునీరు సరిగా అందని పరిస్థితుల్లో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం ఐటిఐ కాలనీకి చెందిన యర్రా సుబ్రహ్మణ్యం, మల్లీశ్వరీల కుమార్తె అఖిల, చినగంజాం మండలం రాజుబంగారుపాలెంకు చెందిన కల్లూరి జయప్రతాప్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. తాము క్షేమంగానే ఉన్నామని చెప్పారు. తాము ఉంటున్న ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నా.. భయంగా గడుపుతున్నట్లు ఫోనులో తెలిపారు.
ఉక్రెయిన్‌లో బిక్కుబిక్కుమంటూ.....
రెండు రోజులుగా కనీసం తాగునీరు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని.. ఉక్రెయిన్‌లో ఉన్న కురిచేడు మండలం వీరాయపాలెంకు చెందిన మోతుకూరి నాగ ప్రణవ్ తెలిపారు. వీరయపాలెంలోని తన తల్లిదండ్రులు మోతుకూరి చిన్న కాశయ్య, హేమలతలకు వాట్సప్ కాల్‌లో మాట్లాడుతూ.. తమను స్వదేశాలకు పంపించాలని.. ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చెప్పాలని యూనివర్సిటీ వారిని కోరినా.. వారు పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమవుతూ తెలిపినట్లు తెలుస్తుంది.
మా పిల్లలు తిరిగి వస్తారో లేదో కూడా తెలియని స్థితిలో..
'26న యుద్ధం జరగవచ్చని ముందుగా ప్రచారం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎంబసీ సిబ్బంది వాహనాల ద్వారా ఉత్తర ప్రాంతాలకు రావాలని తమకు సూచిస్తున్నారని తెలిసింది. అసలే యుద్ధం జరుగుతున్నవేళ విదేశీయులు అక్కడి వాహనాల్లో సుమారు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించడమంటే ఎలా సాధ్యమౌతుంది' అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పిల్లలను స్వదేశానికి రప్పించాలని విన్నవిస్తున్నారు. ఉన్నత చదులకోసం విదేశాలు వెళ్లిన మా పిల్లలు తిరిగి వస్తారో లేదో కూడా తెలియని స్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు.
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశామని టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు వెల్లడించారు. మ్యాపింగ్ చేసిన వాళ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సూచనలిస్తున్నామని చెప్పారు. 23 మంది విద్యార్థులు వస్తున్నారని కేంద్రం సమాచారమిచ్చిందన్న కృష్ణబాబు.. ఏపీకి చెందినవారు ముగ్గురే ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు.
423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశాం: కృష్ణబాబు