కొవిడ్ వేళ నిరంతరంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఎస్పీ నేరుగా వారి ఇంటి వద్దకు వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకొని.. కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా ఒకరికోసం అందరం… అందరికోసం మనమందరం అనే సంకల్పంతో పోలీస్ కుటుంబాల సెల్ఫ్ హెల్త్ గ్రూప్ లను ఏర్పాటు చేశారు. పోలీస్ కానిస్టేబుల్స్ ఇళ్లకు వెళ్లి వారి స్ధితి గతులను తెలుసుకొని దశ సూత్రాలు, పంచ సూత్రాలు అమలుపై స్వయంగా అవగాహన కల్పిస్తున్నారు. ఒంగోలు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున ఏఎస్సై పి.రమేష్ , ఒంగోలు వన్ టౌన్ కానిస్టేబుల్ కె.శ్రీను ఇంటిని సందర్శించారు. అనంతరం వారి భార్య, పిల్లలతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడి …ఆరోగ్య జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ తదితర విషయాలు గురించి అవగాహన కల్పించారు.
ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఉద్యోగ విధులు నిర్వహిస్తున ఫ్రంట్ వారియర్స్ జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ కోరారు. జిల్లా వ్యాప్తంగా 16 మంది లెవెల్ -1 మెంటార్ అధికారాలు అడిషనల్ ఎస్పీ నుంచి డీఎస్పీ స్థాయి అధికారులు పోలీస్ ఫ్యామిలీస్ సెల్ఫ్ హెల్త్ గ్రూప్స్ గురించి పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. 159 మంది ఇప్పటివరకు కరోనా బారిన పడగా.. అందులో తొమ్మిదిమంది విషమంగా ఉన్నారు. 3600 మంది పోలీస్ సిబ్బంది ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించేందుకు 14 మంది డీఎస్పీ లను నోడల్ ఆఫీసర్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి రోజు స్క్రీనింగ్ చేస్తూ కోవిడ్ లక్షణాలను పరిశీలిస్తూ ఆరోగ్య నివేదికలు తయారుచేసి, తగిన సహకారాలు అందిస్తున్నామని ఎస్పీ తెలిపారు.