Drinking water problem: రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీటి సమస్యలే కనిపిస్తున్నాయి. ఎన్నికలలో ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు తాగునీటి సరఫరాను మెరుగు పరుస్తున్నామని.. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిని అందిస్తున్నామని చెప్తున్నారు.. కానీ ఆచరణలో మాత్రం అడుగుపడటం లేదు. అధికారుల మాటలకు పొంతన లేకుండా పోతోంది. ప్రజలు బిందెడు నీటి కోసం.. బండెడు కష్టం పడాల్సి వస్తోంది. వేసవిలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లావాసులు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం గత పది రోజులుగా నీటి కోసం ప్రజలు పడరాని కష్టాలు పడుతున్నారు. గ్రామానికి నీటిని అందించే డీప్ బోరుకు విద్యుత్‌ను అందించే ట్రాన్స్‌ఫార్మర్ పాడైపోవడంతో గుక్కెడు నీళ్ల కోసం పనులు మానుకొని పక్క గ్రామాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం తలకొండపాడు ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. మండలంలోని తలకొండపాడు ఎస్సీ కాలనీలో సుమారు 100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరి అవసరాలకు కాలనీకి చెందిన డీప్ బోరే ఆధారం. గత పది రోజుల క్రితం డీప్ బోరు పాడైపోయింది.
ఫలితంగా గ్రామానికి నీటినందించే మోటారు పని చేయకపోవడంతో నీటి సమస్య ఏర్పడింది. గత పది రోజులుగా బిందెడు నీళ్ల కోసం సమీప గ్రామానికి వెళ్లినా నీళ్లు తమకు అందుతాయో లేదో తెలియని పరిస్థితి. మండుటెండల్లో ఖాళీ బిందెలతో సమీప గ్రామానికి వెళ్లి కుళాయిల వద్ద గంటల తరబడి వేచి చూచినా.. తమ వంతు వచ్చేసరికి నీళ్ల సరఫరా ఆగిపోతుండడంతో చేసేదేమీ లేక ఖాళీ బిందెలతో నిరాశగా వెను తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సరఫరా లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.