ప్రకాశం జిల్లా. ఈ పేరు వినగానే ఒంగోలు గిత్తలు... చీమకుర్తి గ్రానైట్... చీరాల వస్త్రాలు... సినీ ఉద్ధండులు..మార్కాపురం పలకలుగుర్తొస్తాయి. అలాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ప్రకాశం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒంగోలు గిత్తల్లానే రాజకీయ ప్రత్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రయోగాలు చేస్తున్నారు. జిల్లాలో ఈసారి అనేక మార్పులు జరిగాయి. నిన్నటి వరకూ తెదేపాలో ఉన్న నేతలు ఇక్కడ ఉక్కపోత.. తట్టుకోలేక.. ఫ్యాను గాలి కోరుకోగా.. తెదేపా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. కరణం స్థానం మారడం.. శిద్దా రాఘవరావు ఎంపీగా పోటీ చేయడం.. మాగుంటి శ్రీనివాసులు రెడ్డి ఆఖరి నిమిషంలో పార్టీ మారడం... దగ్గుబాటి పునరాగమనం.. ఇవన్నీ ప్రకాశం పోరులో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలు.
చీరాల రాజెవరు..?
రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న చీరాలలో పోటీ నువ్వా...నేనా అన్నట్లు ఉంది. స్థానిక ఎమ్మెల్యే స్వతంత్రుడుగా గెలిచి.. తెదేపాలోకి వచ్చి.. ఇప్పుడు వైకాపాలోకి వెళ్లిపోయారు. ఆమంచి దూకుడుకు కళ్లెం వేయాలని తెదేపా బలరాంను బరిలోకి దింపింది. వ్యక్తిగత ఇమేజ్‌తోపాటు ఫ్యాను దన్నుతో గెలవాలని ఆమంచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్థానికబలం ఎక్కువగా ఉండటంతో తక్కువగా అంచనా వేయొద్దని భావన రాజకీయవర్గాల్లో ఉంది.’ స్థానికేతరుడనే మైనస్ బలరాంను వెంటాడుతోంది.
మార్కాపురం...ఎవరి పరం..?
మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని కాదని ఈసారి నాగార్జునరెడ్డికి సీటు కేటాయించింది వైకాపా. 2014ల్లో పోటీ చేసి ఓడిన నారాయణరెడ్డికే తెదేపా మరో అవకాశం ఇచ్చింది. అభివృద్ధే తమ అభ్యర్థిని గెలిపిస్తుందని తెదేపా ఆశలు పెట్టుకుంది. కానీ వెలిగొండ ప్రాజెక్టు పనులు సాగడం లేదన్న ఆవేదన ప్రజల్లో ఉంది. జగన్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఇక్కడి ప్రజల్లో ఉండటం వైకాపాకు సానుకూలాంశం. జగన్ వస్తేనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తువుతుందని వైకాపా శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.
గిద్దలూరులో గద్దెనెక్కేదెవరు..?
గిద్దలూరు పోరు ఆసక్తికంగా ఉంది. 2014లో పోటీ చేసిన ప్రత్యర్థులే పార్టీలు మారి మళ్లీ తలపడుతున్నారు. వైకాపా నుంచి 2014లో గెలిచిన అశోక్‌రెడ్డి తెదేపా నుంచి బరిలో ఉండగా..తెదేపా తరపున ఓడిపోయిన అన్నా రాంబాబు వైకాపాలో చేరి టికెట్ దక్కించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయికల్పనారెడ్డి ఇటీవల తెదేపాలో చేరడం అశోక్‌రెడ్డికి కలిసొచ్చే అంశం. ఇక్కడ ‘జగన్‌పై ప్రజల్లో ఉన్న సానుకూలత తననే గెలిపిస్తుందని రాంబాబు ధీమాతో ఉన్నారు. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్థి గెలవడంతో ఈ స్థానంపై జనసేన కూడా ఆశలు పెట్టుకుంది. చంద్రశేఖర్‌యాదవ్ పోటీలో ఉండటంతో జనసేన ప్రభావం అధికంగా ఉంది.
కొండపి... నాడీ ఎవరికెరుక..!
వైద్యులిద్దురూ పోటీ పడుతున్న కొండపిలో గెలుపునాడి అందడం లేదు. తెదేపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, వైకాపా అభ్యర్థిగా మాదాసి వెంకయ్య పోటీపడుతున్నారు. మాజీ మంత్రి ఆంజనేయులు, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు వర్గాలు ఇక్కడ కీలకం పాత్ర పోషిస్తాయి. ప్రధాన సామాజికవర్గం పూర్తిగా స్వామి వెంట ఉండడంతో తెదేపా గెలుపుపై ధీమాతో ఉంది. వైకాపా అభ్యర్థికి వైద్యుడిగా ఉన్న పేరు... పార్టీ క్షేత్రస్థాయి బలం కలిసొస్తుందని శ్రేణులు నమ్ముతున్నారు.
ఒంగోలు... గెలుపు గిత్త ఎవరు..?
తెదేపా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, వైకాపా నుంచి జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించడం, వేలాదిగా ఇళ్లు నిర్మిస్తుండడం కలిసి వస్తుందని తెదేపా భావిస్తోంది. కిందటి ఎన్నికల్లో ఓడాక నియోజకవర్గానికి దూరమయ్యారనే అపవాదు వైకాపాపై ఉంది. జనసేన అభ్యర్థిగా షేక్ రియాజ్ పోటీలో ఉండడంతో కాపు, మైనార్టీ ఓట్లు చీలే అవకాశం ఉంది.
పర్చూరు పోరు... ఎవరిది జోరు..?
పర్చూరు నుంచి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగడం ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. తెదేపా నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఏలూరి సాంబశివరావు రెండోసారి పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, వైద్య శిబిరాలు ఉపకరిస్తాయని తెదేపా శ్రేణులు భావిస్తున్నాయి. ‘ఏలూరిపై రైతుల్లో సానుకూలత ఉంది. పాత పరిచయాలు కలిసొస్తాయని దగ్గుబాటి నమ్మకంతో ఉన్నారు.