ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను ప్రకాశం జిల్లా చీరాల ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పేరాల జక్కావారివీధికి చెందిన గుత్తికొండ వెంకటస్వామి క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటాడు. ఇతను గత కొంత కాలంగా ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని యువత నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ పేరుతో డబ్బు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో చీరాల జవహర్‌నగర్‌కు చెందిన తుమ్మా ఉదయప్రసాద్, జాండ్రపేటకు చెందిన కాట్ర వంశీ, స్థానిక జంజనం కాంప్లెక్స్‌లో ఉంటున్న చాపల వేణుగోపాల్‌తో వెంకటస్వామితో కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రి జవహర్‌నగర్‌లోని ఉదయప్రసాద్ ఇంట్లో దాడులు చేశారు. ఆ తరువాత పేరాల జక్కావారివీధికి చెందిన గుత్తికొండ వెంకటస్వామి ఇంటిపైనా దాడిచేసినట్లు డీఎస్పీ వివరించారు. గుట్టుచప్పుడు కాకుండా డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పి.శ్రీకాంత్ హెచ్చరించారు. ఈ ముఠా ఇప్పటివరకు రూ.11.34 లక్షలు తమ ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించామని తెలిపారు. ఆ ఖాతాలను ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను కోరినట్లు డీఎస్పీ తెలిపారు.