ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో.. లంచాలు, అవినీతిపై అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల మధ్య వాగ్వాదం, నిలదీతలు చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సమావేశంలో అధికార పార్టీకి చెందిన ఎంపీపీ పోరెడ్డి అరుణ మాట్లాడుతూ.. ఎంపీడీవో టి.హనుమంతరావు అవినీతికి పాల్పడుతున్నారని, సంబంధిత చిట్టాను పేపరులో రాసుకొచ్చి మరీ సభ్యులకు చదివి వినిపించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నిధుల సమాచారమూ ఇవ్వడం లేదన్నారు.
అన్నీ దొంగ బిల్లులు చేసుకొని ప్రతినెలా రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు డ్రా చేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కార్యాలయాన్ని లంచాలమయంగా మార్చేశారని మండిపడ్డారు. వాలంటీర్లను నియమిస్తే రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు లంచం తీసుకుంటున్నారని, ఉద్యోగులు, పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి ముందుగానే రూ.35 వేలను ఆయనకు అందజేస్తేనే బిల్లులు డ్రా చేస్తారని ఆరోపించారు.
దీనికి స్పందించిన ఎంపీడీవో.. మీ భర్త చెంచిరెడ్డి ప్రతినెలా రూ.లక్ష వరకు ఇవ్వాలని అంటున్నారని, మండల పరిషత్తుకు ఏడాదికి వచ్చే జనరల్ ఫండ్ రూ.10 లక్షలేనని, ఆయన కోసం తాను ప్రతినెలా రూ.లక్ష ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. వెంటనే ఎంపీపీ, ఆమె భర్త ఇద్దరూ కలిసి ఎంపీడీవోతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.