ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశంలో వర్ష బీభత్సం... వాగులు ఉగ్రరూపం - prakasam district latest news

భారీ వర్షాలతో ప్రకాశం జిల్లా తడిసి ముద్దవుతోంది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎన్నో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బల్లికురవ మండలంలో వాగులో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు.

Prakasam district
Prakasam district

By

Published : Sep 26, 2020, 11:05 PM IST

ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలకు గిద్దలూరు, రాచర్ల, మార్కాపురం, అర్ధవీడు తదితర మండలాల్లో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పొలాలు, లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. గిద్దలూరు శ్రీనివాస నగర్ ప్రాంతం వరద ముంపునకు గురైంది. కాలనీ వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాచర్ల మండలంలో గుండ్లకమ్మ వాగు ప్రవాహంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇంకొల్లు మండలం దుద్దుకూరులో చినవాగు ఉద్ధృతికి పొలాలు నీటమునిగాయి. ఇంకొల్లు - గంగవరం మధ్య అప్పేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కారంచేడు మండలం అలుగువాగు ఉద్ధృతికి పల్లపు పొలాలు నీటమునిగాయి. మార్కాపురంలో కురిసిన భారీ వర్షానికి భూపతిపల్లె, బొందలపాడు, పెద్దనాగులవరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

విద్యార్థి మృతి

బల్లికురవ మండలం అంబడిపూడి వద్ద తూర్పు వాగు ఉద్ధృతికి ఇద్దరు విద్యార్థులు గల్లంతు అయ్యారు. వీరిలో ఒకరిని స్థానికులు కాపాడారు. మరొక విద్యార్థి మృతి చెందాడు. మృతుడు అంబడపూడి గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థి శ్రావణ్ కుమార్ (11)గా గుర్తించారు.

అద్దంకి - బల్లికురవ రహదారిపై అంబడిపూడి సమీపంలో వాగు పొంగిపొర్లుతోంది. వాహన రాకపోకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పర్చూరు మండలం అడుసుమల్లిలోని శివాలయం, రామాలయాల్లోకి వర్షపు నీరు చేరింది. రామాలయానికి చెందిన ప్రహరీగోడ కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం వద్ద తొండపువాగు ఉరకలేస్తుండటంతో గరనేపూడికి రాకపోకలు నిలిచిపోయాయి. నాగులపాలెం గ్రామం చుట్టూ వర్షపు నీరు చేరింది. నూతలపాడు, యర్రంవారిపాలెం ప్రాంతాల్లో మిరప పంట నీటమునిగింది.

కొట్టుకుపోయిన ట్రాక్టర్

కంభం మండలం రావిపాడు వద్ద గుండ్లకమ్మ వాగులో ట్రాక్టర్ అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయింది. ఆ వాహనంలోని వ్యక్తులను స్థానికుల సాయంతో అధికారులు కాపాడారు. గిద్దలూరులో శ్రీనివాస థియేటర్ సమీపంలోని పలు ఇళ్లు జలమయమయ్యాయి సామగ్రి తడిచిపోవటంతో లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. నీట మునిగిన ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు తనయుడు సందర్శించి బాధితులకు పునరావాసం కల్పించారు.

నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా చెరువు కట్ట తెగిపోయింది. ఎస్టీ కాలనీలోకి నీరు చేరుతోంది. చీరాల-ఒంగోలు మధ్య రాకపోకలకు ఆటంకం కలిగింది. అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు నీటి కుంటలోకి ఒరిగిపోయింది. సీఐ సుబ్బారావు స్థానికుల సాయంతో ప్రయాణికులను కాపాడారు.

ABOUT THE AUTHOR

...view details