OLIVE RIDLEY TURTLES: ఆలివ్‌రిడ్లే తాబేళ్ల రక్షణ కోసం అటవీశాఖ నిరంతరం శ్రమిస్తోంది. చెన్నైకి చెందిన ట్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాటి రక్షణను చేపడుతోంది. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. పూర్వ ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరాల్లో.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లు పెట్టే గుడ్లను పరిరక్షిస్తూ వస్తోంది. గుడ్ల సంరక్షణ మొదలుకొని వాటిని పొదిగించి.. తిరిగి సముద్రంలోకి వదిలి పెట్టేంత వరకు కంటికి రెప్పలా కాపాడుతోంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని... చీరాల నుంచి గుడ్లూరు వరకు ఉన్న 102 కిలోమీటర్ల తీరంలో.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లు గుడ్లు పెడుతూ ఉంటాయి. జనవరి నుంచి మే వరకు గుడ్లు పెట్టడం, పొదగడం, పిల్లలు తిరిగి సముద్రంలోకి వెళ్లే ప్రక్రియ సాగుతుంది. సముద్ర గర్భంలో జీవనం సాగించే ఈ తాబేళ్లు.. గుడ్లు పెట్టడానికి మాత్రం తీరంలోని ఇసుక తెన్నెల కోసం వేల కిలోమీటర్లు వెతుక్కుంటూ వచ్చి.. ఇక్కడ గుడ్లు పెట్టి వెళ్లిపోతాయి. ఈ గుడ్లను ఇతర జంతువులు, పక్షులు ఆహారంగా మార్చుకునే పరిస్థితి ఉంటుంది. వీటి సంతంతికి రక్షణ కరవవుతూ వచ్చింది.