ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా విభజన.. అభివృద్ధికి దూరంగా.. ప్రజలకు దూరాభారంగా.. - problems while district division news

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటవుతాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా విభజన వల్ల ఒంగోలు మాత్రమే జిల్లా కేంద్రంగా మిగిలిపోతుందని.. అభివృద్ధి పరంగా వెనుకబాటుకు గురవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రతిపాదనలతో ఒంగోలు, మార్కాపురం, కందుకూరు డివిజన్ల వారీగా ఏ నియోజకవర్గం ఎటు ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

జిల్లా విభజన.. అభివృద్ధికి దూరంగా.. ప్రజలకు దూరాభారంగా..!
జిల్లా విభజన.. అభివృద్ధికి దూరంగా.. ప్రజలకు దూరాభారంగా..!

By

Published : Jul 25, 2020, 9:30 PM IST

నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు జిల్లా ఏర్పాటు చేశారు. 1972 డిసెంబర్ 5న టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం ప్రకాశం జిల్లాగా నామకరణం చేశారు. దాదాపు అరకోటి జనాభా.. 17,626 కిలోమీటర్ల విస్తీర్ణంలో రాష్ట్రంలో మూడో అతిపెద్ద జిల్లాగా ఆవిర్భవించింది. ప్రకాశం జిల్లాలో 102 కిలోమీటర్ల తీరం ఉండగా.. పర్యటక, వాణిజ్య పరంగా ఈ తీరానికి ప్రత్యేకత ఉంది. రామయ్యపట్నం, వాడరేవు మినీ పోర్టులు ప్రతిపాదనలో ఉన్నాయి. చీమకుర్తి, బల్లికురువ, మార్టూరు ప్రాంతాల్లో విలువైన గ్రానైట్​ క్వారీలు, వీటి ఆధార పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు ఒంగోలు కేంద్రంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి.

రామతీర్థం, గుండ్లకమ్మ, రాళ్లపాడు రిజర్వాయర్లు ఈ జిల్లాకు ప్రధాన సాగునీటి వనరులు. పశ్చిమ ప్రకాశం వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రధాన వనరులు ఏవీ లేవనే చెప్పాలి. ఓ వైపు కరవు, మరోవైపు పరిమిత వనరులతోనే వాణిజ్య, వ్యాపారాభివృద్ధిని ప్రకాశం జిల్లా సాధిస్తోంది.

మూడు జిల్లాలుగా విభజించే ఆలోచన

ప్రకాశం జిల్లాను బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాలుగా విభజించే ఆలోచనతో ఉన్నారు. ఈ ప్రక్రియ వల్ల గ్రానైట్​ పరిశ్రమలు, ప్రధాన రిజర్వాయర్లు బాపట్ల కిందకు వస్తాయి. అదే సమయంలో ప్రకాశం జిల్లాకు మరో మణిహారంగా మారబోతున్న రామయ్యపట్నం పోర్టు నెల్లూరు జిల్లాకు తరలిపోతుంది.

పేరు మాటేంటి..?

ప్రధానంగా స్వాతంత్య్ర సమరయోధుడు, దివంగత ముఖ్యమంత్రి పేరుతో ఏర్పడ్డ ప్రకాశం జిల్లా పేరు ఉంటుందా..? పోతుందా..? అన్నది చర్చనీయాంశం అయ్యింది. ఆయన స్వగ్రామమైన నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం.. విభజన జరిగితే బాపట్లకు వెళ్లిపోతుంది. సాధారణంగా ప్రముఖులు పుట్టి పెరిగిన ప్రాంతాన్ని ఆధారంగానే తీసుకొని జిల్లా పేర్లు పెడుతుంటారు.

ప్రజలకు దూరాభారం

ప్రజల సౌలభ్యం, దూరం, ఖర్చు తగ్గించడం కోసం విభజన కార్యక్రమం రూపొందిస్తున్నారు. ఇప్పుడు ప్రతిపాదనలో ఉన్న జిల్లాల వల్ల ప్రజలు
మరింత దూరాభారానికి గురవుతారు. జిల్లా విభజనకు ప్రజలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించనప్పటికీ.. భౌగోళికంగా చూసుకొని విభజన చేపట్టాలని కోరుతున్నారు. ఈ జిల్లాను పశ్చిమ ప్రాంతాన్ని ఒక జిల్లాగా, మిగిలింది ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి..

ప్రైవేటు ఆస్పత్రుల వైఖరిపై వైకాపా నేతల ధర్నా

ABOUT THE AUTHOR

...view details