వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ చెప్పారు. మార్టూరు మండలం బొల్లాపల్లిలో దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. మార్కుఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేయిస్తామన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇప్పిస్తామని.. రబీలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు నాణ్యమైన విత్తనాలు ఇస్తామని తెలిపారు. శనగలకు బదులు మొక్కజొన్న సాగు చేసుకోవాలని సూచించారు.
సెప్టెంబరు నెలాఖరు నుంచి ఈ నెల మొదటి వరకు కురిసిన వర్షాలకు.. బొల్లాపల్లిలోని పంటపొలాలు నీటమునిగాయి. రైతులు 750 ఎకరాలు సాగు చేయగా.. 450 ఎకరాలకు పైగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోతదశకు వచ్చిన మినుము పంట మునిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు సుమారు ఏడు వేల వరకు పెట్టుబడి పెట్టామని తెలిపారు. పశువులకు జబ్బు చేసిందని, వైద్య శిబిరం ఏర్పాటు చేయించాలని కోరగా.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.