ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకమైనదని ప్రకాశం కలెక్టర్ పోల భాస్కర్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు కార్యాలయంలో న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించిన.. జాతీయ లోక్ అదాలత్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. న్యాయవ్యవస్థలో చేపట్టిన సంస్కరణల ద్వారా.. ప్రజా వివాదాల పరిష్కారానికి న్యాయ సేవాధికార సంస్థను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. చట్టాల గురించి ప్రజలకు పూర్తిగా తెలియక అనవసరంగా కేసులు పెరుగుతున్నాయని.. వాటిపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తే.. సివిల్ కేసులు చాలా వరకు తగ్గుతాయన్నారు. ఆస్తులు, వినియోగదారులకు సంబంధించిన తగాదాలు ఎక్కువగా వస్తండగా.. వాటిని నియంత్రించగలిగితే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందన్నారు.
న్యాయాన్ని అందరికీ చేరువ చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు.. న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి తెలిపారు. 'దిగులు ఎందుకు దండగ - న్యాయ సేవా సంస్థ ఉండగ' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. లోక్ అదాలత్ ద్వారా రాజీపడదగిన కేసులను సత్వరమే పరిష్కరించుకోవచ్చని వివరించారు. బాధితులకు పరిహారం అందించే పథకం కింద.. 4 కేసుల్లో ఆయా వ్యక్తులకు ఆర్థిక సహాయ పత్రాలను అందించారు.