రెండో రోజు కొనసాగిన అంగన్వాడీల ఆందోళన - మద్దతు తెలిపిన రాజకీయ పలు పార్టీలు Political Parties Support for Anganwadis Agitation in AP:అంగన్వాడీ కార్యకర్తలు రెండో రోజూ ఆందోళనలతో హోరెత్తించారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటే, ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఉద్యమాన్ని నీరుగార్చేలా సర్కారు చర్యలు ఉన్నాయని అయినా వెనక్కి తగ్గేదే లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. అంగన్వాడీల ఆందోళనలకు వివిధ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.
ఎన్టీఆర్ జిల్లా: సమస్యల పరిష్కారం కోరుతూ రెండో రోజూ అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళలు ధర్నా చేశారు. ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య , జనసేన సమన్వయకర్త రమాదేవి శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళల ధర్నాకు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం సంఘీభావం తెలిపారు. విజయవాడ ధర్నాచౌక్‌లో అంగన్వాడీలు ఆందోళన చేశారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. కనీస వేతనాన్ని 26వేలకు పెంచే వరకు పోరు ఆగదని తేల్చి చెప్పారు.
సమస్యలు పరిష్కరించాల్సిందే - అంగన్వాడీల న్యాయపోరాటం
గుంటూరు జిల్లా: కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. ప్రభుత్వం అన్ని డిమాండ్ల అమలుకు అంగీకరిస్తేనే....సమ్మె విరమిస్తామన్నారు. కాకుమానులో మహిళల దీక్షకు టీడీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. మంగళగిరిలో అంగన్వాడీ ఆయాల ధర్నాలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. 4 వేలు ఉన్న అంగన్వాడీల జీతం టీడీపీ హయాంలో 10వేలు అయిందని నేతలు గుర్తు చేశారు. బాపట్లలో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళల ధర్నా కొనసాగింది. చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. నిరసనలో పాల్గొనే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం సరికాదన్నారు.
కృష్ణా జిల్లా: గన్నవరం ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్ వాడీ కార్యకర్తల ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గన్నవరం ఐసీడీఎస్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది ప్రదర్శన చేపట్టారు. వేతన పెంపు ఇతర హామీలను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సత్యసాయి జిల్లా కదిరిలో అంగన్వాడీ కార్యకర్తలపై పని ఒత్తిడిని తగ్గించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మహిళలు డిమాండ్ చేశారు. వీరికి సీఐటీయూ మద్దతు తెలిపింది. అంగన్వాడీలకు నెలకు 26వేల జీతం ఇస్తామని జగన్ మోసం చేశారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ కంటే ఎక్కవ వేతనం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీల ఆందోళనకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. నంద్యాలలో తహశీల్దార్ కార్యాలయ సమీపంలో రోడ్డుపై మహిళలు ఆందోళన నిర్వహించారు. అంగన్వాడీలకు పదోన్నతి కల్పించాలని నేతలు విజ్ఞప్తి చేశారు.
Pratidhwani: అంగన్‌వాడీ వర్కర్ల పోరాటాలపై వైసీపీ సర్కార్ ఉక్కుపాదం.. ఇచ్చిన హామీలను మరిచి, వేధింపులు!
వైఎస్ఆర్ కడప జిల్లామైదుకూరులో ఐసీడీఎస్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. కమలాపురంలో అంగన్వాడీలపై అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరసనకు టీడీపీ, జనసేన నేతలు మద్దతు తెలిపారు. తక్కువ జీతంతో పనిచేస్తున్న అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు రద్దు చేయడం దుర్మార్గమని నేతలు మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 'ఇదేమి రాజ్యం - దొంగల రాజ్యం - దోపిడీ రాజ్యం' అంటూ నినాదాలు చేశారు. వీరికి వామపక్ష, జనసేన నేతలు సంఘీభావం తెలిపారు.
ప్రకాశం జిల్లా:కనిగిరి, వెలిగండ్ల మండలాల్లో నిరసనలు కొనసాగాయి. గిద్దలూరులో అంగన్వాడీలకు సీఐటీయూ మద్దతు తెలిపింది. సమ్మెను విరమింపజేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాకలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె కొనసాగించారు. సింగనమలలో అంగన్వాడీ కార్యకర్త తమ ఆవేదనను పాట రూపంలో ఆలపించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
శ్రీకాకుళం జిల్లా: ఐసీడీఎస్ వద్ద నిరసనలతో మహిళలు హోరెత్తించారు. ఇచ్ఛాపురం బస్టాండ్ కూడలి వద్ద అంగన్వాడీలు నిరవధిక సమ్మె నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ ఇవ్వాలని, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయూ, ఐద్వా, జనసేన నేతలు అంగన్వాడీలకు మద్దతుగా నిలిచారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మహిళలు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. వీరికి టీడీపీ సంఘీభావం ప్రకటించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలు దీక్షలు కొనసాగించారు. ఏలూరు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. జగన్ ఉద్యమాన్ని అణచివేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను మర్చిపోయాడు - డిసెంబర్ 8నుంచి నిరవధిక సమ్మె : అంగన్వాడీ వర్కర్స్