అక్రమంగా మద్యాన్ని తరలించడంలో మద్యం మాఫియా ముఠా కొత్తపుంతలు తొక్కుతున్నారు. ఏదో ఓ రూపంలో పోలీసుల కళ్లుగప్పి మద్యం రవాణా చేస్తున్న సంఘటనలు రాష్ట్రంలో తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ కారులో ప్రత్యేకంగా అరలు తయారుచేసి మరీ.. మద్యం రవాణా చేస్తున్న వ్యక్తులను ప్రకాశంజిల్లా వేటపాలెం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు తెలంగాణ నుంచి ఓ కారులో సుమారు తొమ్మిది వందల ఇరవై క్వార్టర్ సీసాలను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివకృష్ణ అలియాస్ నాని, చైతన్య అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వీరి అక్రమ మద్యం వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న షేక్ సుబాని, కొలా సాయితేజ, బొట్టు మస్తాన్, పర్వతనేని హరికృష్ణలను అదుపులోకి తీసుకోవలసి ఉందని చీరాల డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. వీరు గత కొంతకాలంగా కారు లోపల భాగాలలో చక్కలతో అరలు తయారు చేసి అన్ని భాగాలలో మద్యం బాటిళ్లు అమర్చి పోలీసుల కళ్లు కప్పి అక్రమ మద్యం రవాణా చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి చట్టవ్యతి రేక వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీకాంత్ హెచ్చరించారు.