పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చీరాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు అదనపు ఎస్పీ రవిచంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు చీరాల డివిజన్ పోలీసులు, ప్రత్యేక బలగాలతో పట్టణంలో మంగళవారం కవాతు నిర్వహించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు అల్లర్లకు తావులేకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ సాగేలా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
పురపాలక సంఘం పరిధిలో మొత్తం 33 వార్డులు ఉన్నాయని.. వీటికి సంబంధించిన పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే పరిశీలించామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని ఏఎస్పీ పేర్కొన్నారు. అభ్యర్థులు సమావేశాల నిర్వహణకు తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభాలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత నేరస్థులు, గతంలో ఎన్నికల సమయంలో వివాదాలకు పాల్పడిన వారిని గుర్తించి ముందస్తుగా బైండోవర్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.