police constable died of poison snake bites: రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం అనంతవరంలో మంగళవారం తెల్లవారుజామున పాముకాటుకు గురైన కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి చెందాడు. నిన్న పాము కాటు వేసిన వెంటనే పవన్ కుమార్‌ను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రమేష్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటకీ పవన్ ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు కొల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పవన్ ఆర్-5 జోన్‌లో బందోబస్తుకు వచ్చాడు.
గుడిలో నిద్రిస్తుండగా పాము కాటు: ప్రకాశం జిల్లా తాళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ పవన్ కుమార్ రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ల స్థలాల లే ఔట్ అభివృద్ధి పనుల బందోబస్తుకు వచ్చారు. డ్యూటీ అయిన తరువాత కానిస్టేబుల్ పవన్ తన తోటి ఉద్యోగులతో రాత్రికి అక్కడే ఉన్న గుడిలో నిద్రకు ఉపక్రమించాడు. ఈ క్రమంలో కట్లపాము కానిస్టేబుల్ పవన్ కుడి భుజంపై పాము కాటు వేసింది. పాము కాటుకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పవన్ ఆ పామును చేతితో పట్టుకొని లాగారు. ఈ నేపథ్యంలో ఆ పాము మరో మారు ఎడమ చేతిపై కాటు వేసింది. వెంటనే ఆ పామును తోటి కానిస్టేబుళ్లు చంపివేశారు. మెుదట పవన్ కుమార్‌ను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. గుంటూరు జిల్లా ఎస్పీ అరీఫ్ హఫీజ్ ఆసుపత్రికి వచ్చారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పవన్ కుమార్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చాయి. మెరుగైన చికిత్స కోసం రమేష్ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ పవన్ ఈ రోజు మృతి చెందాడు.