గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడుకు చెందిన లక్ష్మికి అదే గ్రామానికి చెందిన తుపాకుల శ్రీనుతో వివాహమైంది. వీరి కుమారుడు సాయికల్యాణ్ (7). అతను జన్మించిన రెండేళ్ల తర్వాత దంపతుల మధ్య విబేధాలు తలెత్తి విడిగా జీవిస్తున్నారు. దాచేపల్లి మండలం కేసనపల్లిలో ప్రకృతి వ్యవసాయ శాఖలో ఐసీఆర్పీగా కాంట్రాక్ట్ ఉద్యోగినిగా లక్ష్మి పనిచేసేది. ఆ సమయంలో జేసీబీ నిర్వహించే తెలంగాణలోని నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం రంగంగుంట గ్రామానికి చెందిన జానా రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆదికాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఆ తర్వాత లక్ష్మి, జానా రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో కొద్దిరోజులు నివాసం ఉన్నారు. ఈ సమయంలో కొన్ని రోజులు మిర్యాలగూడలో, మరికొన్ని రోజులు దాచేపల్లిలోని కుమారుని వద్ద లక్ష్మి ఉండేది.
ఉద్యోగం వదిలి చీరలపై ఎంబ్రాయిడింగ్ చేసి..
దాచేపల్లి వెళ్లి ఉండటం జానారెడ్డికి ఇష్టం ఉండేది కాదు. కుమారుడిని వదిలి తనతోనే ఉండాలని పలుమార్లు కోరాడు. దీనికి ఆమె అంగీకరించక పోవటంతో చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉండడం క్షేమం కాదని భావించిన లక్ష్మి.. లాక్డౌన్కు ముందు కుమారునితో కలిసి యర్రగొండపాలెంలోని తన సోదరి వద్దకు వెళ్లింది. విధులను కూడా మండలంలోని యల్లారెడ్డిపల్లెకు మార్పించుకొని వై. పాలెంలో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటోంది. అనంతరం ఉద్యోగం వదిలి చీరలపై ఎంబ్రాయిడింగ్ చేసి.. తెలంగాణలోని మిర్యాలగూడలో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.