Pastor murder case: ప్రకాశం జిల్లా సి.ఎస్.పురం మండలం ఏకునాంపురానికి చెందిన దళిత పాస్టర్ దాసరి వెంకట రమణయ్య (55) హత్యకేసును పోలీసులు ఛేదించారు. వైకాపా నాయకుడు, ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. 17, 16, 13 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురతో హత్య ప్రణాళికను అమలు చేసినట్లు తేల్చారు. దర్శి డీఎస్పీ వి.నారాయణస్వామి రెడ్డి బుధవారం వివరాలు వెల్లడించారు.
వైకాపా నాయకుడు కేతనబోయిన శ్రీనివాసులుకు.. వెంకటరమణయ్యకు మధ్య భూ వివాదాలు ఉన్నాయి. ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు, గ్రామంలో ఇతర అక్రమాలపై ఆయన తరచూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో రమణయ్యపై కక్ష పెంచుకున్న శ్రీనివాసులు.. ఆయనను అంతం చేయాలని పథకం పన్నాడు. ముగ్గురు బాలురతో తన పథకాన్ని అమలు చేశాడు.
ఈ నెల 3న సాయంత్రం, అరివేముల నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న వెంకట రమణయ్యను.. చెర్లోపల్లి సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు కాలువ వద్ద బాలురు అడ్డగించారు. ఆయన తలపై కర్రలు, రాళ్లతో కొట్టి గాయపరిచారు. అనంతరం సమీప జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి బండరాయితో మోది హత్య చేశారు.మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి చిల్లచెట్లలో పడేశారు. ఈ ఘటనలో 8మందిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి భార్య నారాయణమ్మ పోలీసులకు ఫిర్యాదుచేశారు. విచారణ జరిపిన పోలీసులు ప్రధాన నిందితుడు శ్రీనివాసులు సహా బాలలను అదుపులోకి తీసుకున్నారు.
శ్రీనివాసులును పొదిలి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ముగ్గురు బాలురను జువెనైల్ హోంకు తరలించారు. కేసు దర్యాప్తును డీఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు.
కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వి.నారాయణస్వామి రెడ్డి సంబంధిత కథనం:MURDER: పాస్టర్ దారుణ హత్య.. అక్రమాలు ప్రశ్నించినందుకే ఈ ఘాతుకం?