Anganwadi Teacher Murder Case : ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో జరిగిన అంగన్వాడీ కార్యకర్త హనుమాయమ్మ హత్య కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యలో రాజకీయ కోణం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. కుటుంబ కలహాల వల్లే నిందితుడు హనుమాయమ్మను హత్య చేశాడని తెలిపారు. అతడు మృతురాలికి సమీప బంధువే అని వెల్లడించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు.
ఎస్పీ మలికా గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. టంగుటూరు మండలంలోని రావివారిపాలెం గ్రామానికి చెందిన హనుమాయమ్మ అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త సుధాకర్ టీడీపీలో కార్యకర్తగా పని చేస్తున్నారని వివరించారు. హంతకుడు కొండల్రావు వీరికి సమీప బంధువేనని.. వీరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయని తెలిపారు. ఇరు కుటుంబాల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా వివాదాలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో జరిగిన వివాదాల్లో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కాగా.. ఇరువర్గాలు రాజీ కుదుర్చుకున్నారన్నారు.
మళ్లి గత కొంతకాలంగా ఇరు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తటంతో.. కొండల్రావు హనుమాయమ్మను హత్య చేసినట్లు వివరించాడని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో కొండల్రావును ఏ1గా గుర్తించినట్లు తెలిపారు. అంతేకాకుండా అతని కుటుంబసభ్యులైన అతని సోదరుడు మహేష్, తల్లి రమణమ్మ, మరో మహిళ ఆదిలక్ష్మిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.