ప్రకాశం జిల్లా వేటపాలెంలో మార్చి నెలలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు.
దీని గురించి చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి వివరాలు తెలియజేశారు. 'ఈ ఏడాది మార్చిలో వేటపాలెంలో దొంతి వెంకటేశ్వరరెడ్డి, అతని స్నేహితుడు సుబ్బారెడ్డి కలిసి మద్యం తాగారు. ఆ మత్తులో వారి మధ్య చిన్న మాట పట్టింపు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ కొత్తకాలువ రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్లారు. అక్కడ సుబ్బారెడ్డి.. వెంకటేశ్వరరెడ్డిని గొడ్డలితో నరికి, గొంతు నులిమి చంపేసి కాలువలో పడేశాడు. దీనిపై ముందు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశాం. అయితే మృతుని బంధువులు అనుమానం వ్యక్తం చేసిన క్రమంలో హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టి ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేశా'మని డీఎస్పీ వివరించారు.