ప్రకాశంజిల్లా.. తాళ్ళూరు మండలం బొద్దికూరపాడులో నివాసముంటున్న యోగమ్మ, రమణమ్మ, పద్మ.. నిరుపేదలు. వీరు రోజువారీ కూలీ చేసుకొని జీవనం సాగిస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం ఈ ముగ్గురు మహిళలు ప్రభుత్వం వారు పేదలకు ఇచ్చే నివేశనా స్ధలాలకు అర్జీ చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు గ్రామంలో విచారించి అర్హులుగా గుర్తించి వీరికి ఒక్కొక్కరికీ రెండు ఎకరాల భూమి చొప్పున డీ.కే.పట్టాలు మంజూరు చేశారు. ప్రభుత్వం వారు ఇచ్చిన భూమి బాగు చేసుకుని పంట పండించుకుంటున్నారు.
అప్పటి నుండి గ్రామంలోని నాయకులు ఎవరు వీరి జోలికి వెళ్ళలేదు. కానీ ఇటీవల గ్రామంలో ఓ రాజకీయ నాయకుడు వీరి పొలంపై కన్నేశాడు. ఎందుకంటే వీరి డీ.కే. పట్టాపొలాన్ని ఆనుకొని ఆ రాజకీయ నాయకుని పట్టా పొలం ఉంది. వీరి పొలాన్ని పేదలకు ఇళ్ళ స్థలాల కింద ఇప్పిస్తే ..తన పొలానికి మంచి గిరాకీ వస్తుందని భావించాడు. అంతే అతని రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అధికారుల వద్ద పావులు కదిపాడు.
ఆ మహిళల పొలాన్ని పేదలకు ఇళ్ళ స్థలాలుగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. డీ.కే.పట్టాలు పొందిన మహిళలు అధికారుల వద్ద ఎంత మొరపెట్టుకున్నా.. ఫలితం దక్కలేదు. తమకున్న కాస్త ఆధారాన్నీ లాగేసుకోవటం ఎంతవరకు న్యాయమని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.