Pensioners Dharna: రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించి.. పేదవారిని ఆదుకోవాలని రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. సీపీఐ ఆధ్వర్యంలో కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అదేవిధంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పలువురు బాధితులు ఒంగోలు కలెక్టరేట్లో జరిగే స్పందనలో అర్జీ ఇచ్చేందుకు వచ్చారు. పోలీసులు లోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పింఛన్దారునికి, కుటుంబ సభ్యులకు 1000 చదరపు గజాల ఇంటి స్థలం ఉందని, కరెంట్ బిల్లు వినియోగం 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉందని, కుటుంబ సభ్యులు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగం తదితర కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలు నుండి 6 లక్షల వరకు పింఛన్లు తొలగించటం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలన్నారు.
ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న పింఛన్లు.. వివిధ కారణాలతో తొలగించడం సరికాదని భాదితులు తెలిపారు. తమకు ఎవ్వరూ లేరని.. పింఛన్ మీద ఆధారపడి జీవిస్తున్నామని.. ఇప్పుడు తొలగిస్తే తాము ఎలా జీవించాలని కర్నూలులో వృద్ధ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.