ప్రకాశం జిల్లా మెడపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల్లోని ఫర్నిచర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వేసవి సెలవుల అనంతరం బుధవారం పాఠశాల తెరిచి చూసిన సిబ్బందికి.. 2 గదుల తలుపులు పగిలిపోయి కనిపించాయి. విద్యార్థులు కూర్చునే సిమెంట్ బల్లలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఉన్నాయి. కిటికీలు ధ్వoసమయ్యాయి. ర్యాంప్ పైపులు పీకేశారు. మరుగు దొడ్డికి నీళ్లు సరఫరా చేసే పైప్‌లైన్ తొలగించారు. రెండు తరగతి గదుల్లో మద్యం సీసాలు, బీర్ బాటిళ్ల ముక్కలు పడేశారు.
పాఠశాల ఆవరణలోనూ మద్యం సీసాలు పగలగొట్టి బీభత్సం చేశారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. వారాంతపు సెలవుల తరువాత మరుసటి రోజు పాఠశాలకు వస్తే ప్రాంగణమంతా మద్యం సీసాలు పగల కొట్టి మైదానంలో, తరగతుల దగ్గర ముక్కలు ముక్కలు గా దర్శనమిస్తాయని ఉపాధ్యాయులు చెప్పారు. పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.