ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. ఈ నెల 29 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుండగా బుధవారం జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిర్వహించిన వీక్షణ సమావేశానికి హాజరయ్యారు. రెండు, మూడు రోజులుగా కొంత స్తబ్ధుగా ఉన్న నాయకులు మొదటి విడత ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
రిజర్వేషన్ల వారీగా పంచాయతీల్లో గెలిచే సత్తా ఉన్న మద్దతుదారులు, పోటీకి ముందుకొచ్చే ఔత్సాహికుల కోసం వేట ప్రారంభించారు. పార్టీ గుర్తులు లేకుండా జరిగే పోరులో పైచేయి సాధించాలని, తద్వారా తమ రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికలను తొలి మెట్టుగా చేసుకోవాలని స్థానిక నాయకులతోపాటు, ఇతర ప్రాంతాలు, విదేశాల్లో ఉన్నవారు సైతం దృష్టిపెట్టారు. ఈ పరిణామాలతో పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది.
గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర
గ్రామ పాలనలో అత్యంత కీలక పాత్ర సర్పంచిది. అయిదేళ్ల పదవీ కాలంలో చేపట్టే పనుల ద్వారా పేరు తెచ్చుకుంటే రాజకీయంగా మరో మెట్టు ఎక్కేందుకు అవకాశం ఉంటుంది. నేరుగా వచ్చే ఆర్థిక సంఘం నిధులతో గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్పంచిగా పోటీ చేయడానికి రాజకీయ అనుభవం ఉన్నవాళ్లే కాకుండా పలువురు యువకులు కూడా మొగ్గు చూపుతున్నారు. అయితే రిజర్వేషన్ల కారణంగా కొందరికి ఆ అవకాశం లేకపోవడంతో తమ అనుచరులు, నమ్మకస్తులను తెరపైకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ సొంత ఊళ్లలో సొంత నిధులతో అడపాదడపా చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని స్థానిక రాజకీయాలపై దృష్టిపెట్టారు. అవకాశం ఉంటే పోటీకి కూడా ముందుకొస్తున్నట్లు పార్టీల నాయకులు చెబుతున్నారు.
349 పంచాయతీల్లో...
జిల్లాలో తొలివిడత ఎన్నికలు ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 20 మండలాల్లో ఉన్న 349 పంచాయతీల్లో ఫిబ్రవరి 9న జరగనున్నాయి. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలోని మండలాల్లో అత్యధికంగా అద్దంకి, పర్చూరులో 26 చొప్పున, అత్యల్పంగా వేటపాలెంలో ఒక పంచాయతీకి ఎన్నికలు జరగనుండగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి:రామ మందిర నిర్మాణానికి మాజీ మంత్రి కాశిరెడ్డి విరాళం