కరోనా వైరస్ కారణంగా ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. వైరస్ బారిన పడకుండా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్కెట్లలో లభించే ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తుల వినియోగానికి మోగ్గుచూపుతున్నారు. ఫలితంగా.. ప్రకృతి , సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులు లాభాల బాటపడుతున్నారు. పంటంతా అమ్ముడుపోతుండడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన నాయుడు మాల్యాద్రి, ప్రకృతి సేద్యం చేసే రైతు. చీమకుర్తిలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆకు కూరలు, కూరగాయలు సాగుచేస్తున్నారు. ఉత్పత్తి తక్కువుగా ఉన్నా, ఖర్చు లేని వ్యవసాయం అవ్వడం వల్ల ఆదాయం ఆశించిన స్థాయిలోనే ఉంటుందని మాల్యాద్రి తెలిపారు. గతంతో పోలిస్తే లాక్డౌన్లో ప్రకృతి సాగు ఉత్పత్తులకు మార్కెట్ పెరిగిందని, ఆదాయం కూడా బాగుందని మాల్యాద్రి అంటున్నారు.